తిరుపతి, ఫిబ్రవరి 22:శ్రీకాళహస్తి ఆలయంలో సింగర్ మంగ్లీ పాట చిత్రీకరణపై వివాదం నెలకొంది. ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని ఆలయ అధికారులు, పాలక మండలి ఆంక్షలు ఉన్నాయి. అయినా కాలభైరవ ఆలయం, రాహుకేతు పూజల మండపంలో పాట చిత్రీకరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ పాట చిత్రీకరణపై దేవస్థానం అధికారులు నోరు మెదపడంలేదు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వాయు లింగ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇటీవల సింగర్ మంగ్లీ చిత్రీకరించిన పాట వివాదాస్పదంగా మారింది. శ్రీకాళహస్తీ ఆలయంలోకి ఎటువంటి సెల్ఫోన్లు, కెమెరాలు, అనుమతించమంటూ ఆలయ అధికారులు, పాలక మండలి విధించిన ఆంక్షలు పక్కన పెట్టి ఆలయ అధికారులే మంగ్లీ పాటల చిత్రీకరణకు అనుమతించారు. ఆలయం లోపలికి కెమెరాలు తీసుకుని వెళ్లి పాట చిత్రీకరణ చేసినట్లు తెలుస్తోంది.
ముక్కంటి ఆలయంలోనే పాటలు చిత్రీకరణ రాహుకేతు సర్ప దోష పూజ మండపంలో, కాళభైరవ ఆలయం ముందు భాగంలో మంగ్లీ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ జ్ఞానఫ్రశూంనాభ, వాయులింగేశ్వరుడి కొలువైవున్న కాళహస్తిలో సింగర్ మంగ్లీ బృందం శివరాత్రి పాట చిత్రీకరించారు. ముక్కంటి ఆలయంలో పాట చిత్రీకరణకు అనుమతి ఎవరు ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. శివరాత్రికి పది రోజుల ముందు పాట చిత్రీకరణ అయినట్టు తెలుస్తోంది. పాట చిత్రీకరణలో శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్ధగిరిస్వామి, మిగిలిన స్వాములు ఉండడం విశేషం. అసలు ఆలయంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, సెల్ ఫోన్లు తీసుకు వెళ్లకూడదని నిషేధం ఉన్నా మంగ్లీ బృందం ఏవిధంగా ఆలయంలో పాటను చిత్రీకరించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవాల సమయంలో, మరీ ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలోనే గడిపే స్థానిక శాసనసభ సభ్యుడు బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆలయ ఈ.ఓ. సాగర్ బాబులకు తెలియకుండానే మంగ్లీ బృందం పాట చిత్రీకరణ చేశారా అనేది భక్తులు ప్రశ్నిస్తున్నారు.
కాలభైరవ స్వామి, అమ్మవారి ఆలయం, ఆలయంలో ఉన్న స్పటిక లింగం వరకు మంగ్లీ బృందం నృత్య ప్రదర్శన జరిగింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు, శాసనసభ సభ్యుడు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది తెలియాల్సి ఉంది. శివ భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ప్రవర్తించారని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీడియా ముందుకు రాకుండా ఆలయ ఈవో సాగర్ బాబు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు మొహం చాటేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవదాయశాఖ కార్యదర్శి నుంచి శ్రీకాళహస్తి ఆలయంలో పాట చిత్రీకరణకు అనుమతిని తీసుకున్న సమాచారం. ఇందుకు అనుగుణంగా జీవో విడుదల చేయగా, ఆ జీవోను అధికారులు, పాలక మండలి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. కాళహస్తి ఆలయంలో పాట చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు భక్తులు.