వరద ముంపు బాధితులు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ఇంటి ముందు ఆందోళన చేశారు. శుక్రవారం ఎన్ టీఆర్ , రాంనగర్, బాలాజీ కాలనీ వాసులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చారు. వరద బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీస్ లు అడ్డుకున్నప్పటికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు.
ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన తనయుడు నడిపెళ్లి విజిత్ రావు బయటకు వచ్చి బాధితులతో మాట్లాడారు. బాధితులు తమ ఆక్రోశం వెలిబుచ్చారు. గత ఏడాది కూడా వరదలతో లక్షల రూపాయలు నష్టపోయామని వాపోయారు. ఈసారి కూడా వరద నీరు ఇండ్లలోకి రావడంతో నష్టపోతున్నామని చెప్పారు. శాశ్వత పరిష్కారం చూపకపోవడం వల్ల వరదలకు నష్టపోతున్నామని ఆరోపించారు. నష్ట పరిహారం కూడా అందలేదని విమర్శించారు. విజిత్ రావు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా బాధితులు సంతృప్తి చెందలేదని తెలిసింది.