టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌కి సన్మానం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు టాప్ రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయించడంలో కీలక పాత్ర పోషించిన చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ని సంస్థ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. కేబినేట్ వీలిన నిర్ణయం తర్వాత తొలిసారిగా గురువారం బస్ భవన్‌కు వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. బస్ భవన్‌లోని తన ఛాంబర్‌లో చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. తాను చైర్మన్ ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం తనకెంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. 43 వేల మంది టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున సీఎం కేసీఆర్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత లభించిందన్నారు.
ప్రభుత్వ వీలిన నిర్ణయం వెనక ప్రతి ఉద్యోగి కష్టం, కృషి ఉందని చెప్పారు. సంస్థను బాగు చేయాలనే ఉద్దేశంతో టీఎస్‌ఆర్టీసీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలాగా తాను పనిచేస్తున్నానని వివరించారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను తీసుకువచ్చామని చెప్పారు. ఎండీ సజ్జనర్, తాను బాగా పనిచేసి సంస్థను అభివృద్ది బాటలో తీసుకెళ్తున్నారని చాలా మంది మెచ్చుకుంటున్నారని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ క్రమశిక్షణ గల సంస్థ అని, సిబ్బంది ఎప్పటి మాదిరిగానే భవిష్యత్‌లోనూ బాధ్యతగా పని చేసి సంస్థకు దేశంలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ బాగు కోసం చైర్మన్, ఎండీ ఎంతగానో కృషి చేశారని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కొనియాడారు.
సంస్థ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా సిబ్బందికి 7 డీఏలను ఇప్పించారని గుర్తుచేసుకున్నారు. సంస్థలోని సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంస్థ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, చీఫ్ మేనేజర్ (ప్రాజెక్ట్స్) విజయ్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్, సీఎఫ్‌ఎం విజయపుష్ఫ, సీసీవోఎస్ విజయభాస్కర్, సీసీఈ రాంప్రసాద్, బిజినెస్ హెడ్ సంతోష్ కుమార్, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్‌ఎంలు శ్రీధర్, వరప్రసాద్, ఖుస్రోషా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.