తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. నెల వ్యవధిలో రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. కిలో చికెన్ ధర 300 రూపాయలు దాటిపోయింది. ఫలితంగా చికెన్ ప్రియులు నిరాశ చెందుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. గత నెలలో ఓ మాదిరిగా ఉండగా…. ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు అయ్యాయి. ఏప్రిల్ 1న కేజీ చికెన్ ధర సుమారు రూ.150 ఉంటే…. ప్రస్తుతం రూ.300 దాటిపోయింది. బ్రాయిలర్ చికెన్ ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.300 పలుకుతుంది. ఇక స్కిన్‌లెస్ చికెన్ చూస్తే…. రూ.320కి చేరింది. లైవ్ చికెన్ ధర రూ.160కి పెరిగింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా చికెన్ ధరలు రూ.330 వరకు చేరాయి.ఫలితంగా చికెన్ అంటేనే మాంస ప్రియులు అమ్మో అంటున్నారు. రేట్ల ఎఫెక్ట్ తో కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. మరికొద్దిరోజులు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వాతావరణంలో మార్పుల కారణంగా కోడిపిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదొక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని, ఇవి కూడా ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. ఏటా సమ్మర్ లో చికెన్, మటన్ ధరలు పెరుగుతాయి.
ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులు కోడి మాంసం కొనుగోలు పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. వేసవికాలంలో కోళ్ల మరణాలు సాధారణమే.. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్లను ఎండ వేడిమి నుంచి కాపాడేందుకు నీళ్లు చల్లుతూ.. ఆ చుట్టుపక్కల వాతావరణం చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఫలితం లేదంటున్నారు. అలాగే ఈ ఎండల దెబ్బకు కోళ్లు సరిగా ఆహారం తీసుకోవడం లేదు.. దీంతో కోడి బరువు కూడా తగ్గుతోందంటున్నారు.
ఫలితంగా మాంసం ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది అంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కోళ్ల పెంపకంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ప్రియులు ఈ ధరలు చూసి షాక్ అవుతున్నారు. చికెన్ ముక్క తినాలన్నా జేబుకు చిల్లు తప్పడంలేదంటున్నారు. సహజంగా వేసవిలో కోడి మాంసం రేట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో కోడి మాంసం ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ధరలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు తెలిపారు. అయితే నైరుతి ఎంట్రీ ఇవ్వటంతో… ధరలు తగ్గే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.