తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర ఆకాశాన్ని తాకాయి. ఏపీలో భగ్గుమంటున్న ఎండలకు తోడు.. పెరుగుతున్న చికెన్ ధరలతో జనాలకు చెమటలు పడుతున్నాయి. చికెన్ ధర నెల వ్యవధిలోనే రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ. 320 నుంచి రూ.330 వరకు ఉంది. ఎండల ప్రభావంతో పాటూ రవాణా ఛార్జీలు, కోళ్ల దాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరగడంతో చికెన్ రేట్లు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు.వీకెండ్, అందులో ఆదివారం రోజున చికెన్ తిందామని మార్కెట్‌కు వెళ్లిన జనాలు ధరలు చూసి అవాక్కయ్యారు.
కేజీ చికెన్ ధరకు కొంత కలిపితే అరకిలో మటన్ వస్తుందని మటన్ షాపులకు వెళ్లారు.. మరికొందరు చేపలవైపు మొగ్గు చూపారు. వీకెండ్‌లో భారీగా ఉండే చికెన్ అమ్మకాలు చాలా వరకు పడిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులు ఉసూరుమన్నారు.చికెన్ ధరలు భారీగా పెరగడానికి కారణాలు లేకపోలేదు. అసలే వేసవికాలం.. ఎండకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో వేలాదిగా కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు రైతులు. అలాగే ఈ వాతావరణం దెబ్బకు కోళ్లు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో ఎదుగుదల కూడా లేదంటున్నారు. ఈ ప్రభావంతో మాంసం ఉత్పత్తి తగ్గిపోయిందని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు కూడా 45 డిగ్రీల వరకు చేరాయి.. మనుషులే ఈ ఎండకు అల్లాడిపోతున్నారు. కోళ్లు కూడా ఎండలకు అల్లాడిపోతున్నాయి. కోళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఫలితం లేదంటున్నారు వ్యాపారులు.వేసవికాలంలో కోళ్ల మరణాలు సాధారణమే.. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్లను ఎండ వేడిమి నుంచి కాపాడేందుకు నీళ్లు చల్లుతూ.. ఆ చుట్టుపక్కల వాతావరణం చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఫలితం లేదంటున్నారు.
అలాగే ఈ ఎండల దెబ్బకు కోళ్లు సరిగా ఆహారం తీసుకోవడం లేదు.. దీంతో కోడి బరువు కూడా తగ్గుతోందంటున్నారు. దీంతో మాంసం ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది అంటున్నారు.చికెన్ మాత్రమే కాదు గుడ్లపై కూడా ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది ఎండల కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 4.40 నుంచి చిల్లర ధర రూ. 4.85 పలుకుతోంది. అయితే గిట్టుబాటు ధర గుడ్డు ధర రూ. 5.25 ఉండాలంటున్నారు రైతులు. ఎండలతో పాటూ దాణా ధరల పెరిగాయని.. తగ్గిన ఎగుమతులతో నష్టాల్లో ఉన్నామంటున్నారు. మరో నాలుగైదు రోజులు ఎండలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.