గోవా టూర్వెళ్లారా..? బాగా ఎంజాయ్చేశారా..? అగ్వకు దొరుకుతాయి.. పైగా పర్మిట్ కూడా ఇస్తారు కదా.. అని ఓ రెండు బాటిళ్లు తెచ్చేసుకుందామనుకుంటున్నారా? అయితే ఇకపై కుదరదు. రాష్ర్ట ఎక్సయిజ్చట్టంలో ఇటీవల చేసిన సవరణల ప్రకారం ఒక్కటంటే ఒక్క మద్యం బాటిల్కూడా గోవా నుంచే కాదు.. మరే రాష్ట్రం నుంచి ఇక్కడకు తీసుకురావటానికి వీల్లేదు. విమానంలో తెచ్చుకున్నా.. బస్సులో తెచ్చినా ఎక్సయిజ్అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవటం ఖాయం. ఇక, పెద్ద సంఖ్యలో బాటిళ్లు దొరికితే స్మగ్లింగ్కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ కేసుల్లో పదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం డ్యూటీ ఫ్రీ షాపు నుంచి కొన్న రెండు లీటర్ల మద్యం బాటిళ్లకు అనుమతి ఉంటుందని చెప్పారు.ఎండాకాలం వచ్చిందంటే చాలు వేలాదిమంది గోవాకు క్యూ కట్టే విషయం తెలిసిందే. దాంతోపాటు ఊటీ, కేరళ, కశ్మీర్తదితర ప్రాంతాలకు సమ్మర్ టూర్లకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఇలా వెళ్లిన వారిలో ముఖ్యంగా గోవా పర్యాటకులు తిరిగి వచ్చే సమయంలో మద్యం బాటిళ్లను కొనుక్కుని రావటం కొన్నేళ్లుగా సాగుతోంది.
దీనికి కారణం కేంద్ర పాలిత ప్రాంతమైన నేపథ్యంలో ఖరీదైన బ్రాండ్లు కూడా అక్కడ చాలా తక్కువ ధరకు దొరకటం. పైగా, దేశంలోని ఏ ప్రాంతానికైనా రెండు బాటిళ్ల మద్యం తీసుకెళ్లటానికి అక్కడి వైన్షాపులు పర్మిట్లు ఇవ్వటం. ఈ పర్మిట్ ఉంటే చాలు ఒక్కొక్కరు రెండేసి బాటిళ్ల చొప్పున గోవా నుంచి తమకిష్టమైన బ్రాండ్మద్యాన్ని తీసుకొచ్చుకునేవారు. ఈ లెక్కన ఓ అయిదుగురు స్నేహితులు కలిసి వెళ్తే పది మద్యం బాటిళ్లు హైదరాబాద్‌కు చేరేవి. ఇలా గోవానే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్న వారు మన రాష్ట్రంకన్నా తక్కువ ధరలకు మద్యం దొరుకుతున్న ప్రాంతాల నుంచి బాటిళ్లు తెచ్చుకునేవారు.
ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఎక్సయిజ్చట్టానికి సవరణలు చేసింది. వీటి ప్రకారం ప్రస్తుతం గోవానే కాదు ఏ రాష్ర్టం నుంచి కూడా ఒక్క మద్యం బాటిల్‌ను కూడా ఇక్కడకు తీసుకొచ్చుకోవటానికి వీల్లేదు. ఈ క్రమంలో రాష్ర్ట సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో.. శంషాబాద్అంతర్జాతీయ విమనాశ్రయంలో ఎక్సయిజ్, పోలీసు అధికారులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి మద్యం బాటిళ్లు దొరికితే సీజ్చేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లోనే శంషాబాద్ఎక్సయిజ్పోలీస్స్టేషన్అధికారులు రెండు వందలకు పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఎక్సయిజ్ చట్టంలో చేసిన సవరణల గురించి తెలియక చాలామంది మద్యం బాటిళ్లు తెచ్చుకుని ఇక్కడ దొరికిపోతున్నారు.ఇక, మద్యం స్మగ్లింగ్‌ను అరికట్టటానికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్సయిజ్ అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్యాంగులు పక్కా ప్లాన్ల ప్రకారం మన రాష్ర్టంలో కన్నా తక్కువ ధరలకు మద్యం దొరుకుతున్న చోట్లకు వెళ్లి కార్లు, డీసీఎం వ్యాన్లు ఇలా వీలైన ప్రతీ వాహనంలో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను ఇక్కడకు స్మగుల్చేస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల రాష్ర్ట ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోందన్నారు. పైగా, మద్యం స్మగ్లింగ్చేస్తున్న వారిలో కొందరు దానిని కల్తీ చేసి ఇక్కడ అమ్ముతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మద్యం స్మగ్లింగ్‌ను అరికట్టటానికి అన్ని చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తాము తీసుకుంటున్న ఈ చర్యల వల్ల గత రెండు మూడు నెలలుగా మద్యం స్మగ్లింగ్గణనీయంగా తగ్గినట్టు వివరించారు.