తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తొలి మ్యానిఫేస్టోను విడుదల చేశారు. మూడు వర్గాలను ఎంపిక చేసుకుని వారికి తాము అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామో చెప్పారు. అయితే దీనికి భవిష్యత్ గ్యారంటీ అని నామకరణం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే చంద్రబాబు అనుసరిస్తున్నారు. కర్ణాటకలోనూ ఐదు స్పష్టమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు విడుదల చేసింది. దానికి నకలుగానే టీడీపీ తొలి మ్యానిఫేస్టోను చూడాల్సి ఉంటుంది. కర్ణాటక తరహాలోనే మహిళలకోసం ప్రత్యేక పథకాలను చంద్రబాబు ప్రకటించారు. దీనికి మహిళ శక్తి అని పేరు పెట్టారు. ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500లు ఇస్తారు. ఇంట్లో ఎందరు మహిళలున్నా వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలు మాత్రమే దీనికి అర్హులు. ఇక జిల్లాల్లో ప్రతి మహిళకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించారు. అలాగే అమ్మఒడి తరహాలోనే తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి ఏడాదికి పదిహేను వేలు ఇస్తారు. దీనికి లిమిట్ లేదు. ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. దీంతో పాటు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అంటే ఏడాదికి ఒక కుటుంబానికి 3,600 రూపాయలు సేవ్ అయినట్లే. అలాగే ఇంటింటికి మంచినీరు అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యతగా దీనిని తీసుకుంటామని చెప్పారు.
ప్రతి ఇంటికీ ఉచితంగా ఇంటి కుళాయి ఇస్తారు. అన్నదాత పథకం కింద… ఇక అన్నదాత పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నారు. అంతేకాకుండా యువగళం పేరుతో ఏపీలోని నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు ఇద్దరు పిల్లల చట్టాన్ని ఎత్తేస్తామన్నారు. దీంతో పాటు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామన్నారు. అయితే ఈ హామీలను చంద్రబాబు అధికారంలోకి వస్తే అమలు చేస్తారా? లేదా? అన్నదానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు తొలి ప్రయారిటీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు మాత్రమే. వీటికి వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.
సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తామని చెబుతున్నప్పటికీ అందుకు అవసరమైన నిధులు చంద్రబాబును ఇబ్బంది పెడతాయంటున్నారు. ఆయన ఈసారి అధికారంలోకి వస్తే అమరావతిపైన దృష్టి పెట్టిన తర్వాతనే మరో అంశాన్ని పరిశీలిస్తారన్నది ఆ పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్న విషయం. 2014లో మ్యానిఫేస్టోను పక్కన పెట్టారని ఇప్పటికీ అధికార పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. కర్ణాటకలో ఇప్పటికే హామీలు అమలు చేేయాలంటూ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ప్రజలు తిరగబడుతున్నారు. నెలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తును ఇస్తామన్న కాంగ్రెస్ ప్రకటనతో మీటర్ రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చేందుకు వెళుతున్న లైన్‌మెన్లపై జనం దాడులకు దిగుతున్నారు.
ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలు కండక్టర్లపై తిరగబడుతున్నారు. యాభై వేల కోట్లు సిద్ధరామయ్య ఇచ్చిన గ్యారంటీ కార్డు కు అవుతుండటంతో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఇచ్చే భృతి విషయంలోనూ కొర్రీలు పెట్టారు. అలాగే ఉచిత ప్రయాణంపై కూడా నిబంధనలు విధించారు. కేవలం పేద మహిళలకే ఈ పథకాలు వర్తిస్తాయని చెబుతున్నారు. దీంతో పాటు ఇక చంద్రబాబు హామీలు ఇచ్చి అమలు చేయరన్న అపవాదు ఎటూ ఉండనే ఉంది. అందుకే ఈ గ్యారంటీ కార్డుపై జనం ఏ మాత్రం నమ్మకం పెట్టుకుంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు మాత్రం తనను గెలిపిస్తే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతున్నారు.
రాజకీయ నేతకు ప్రధమంగా ఉండాల్సింది జనంలో నమ్మకం. జనం నమ్మితే మాత్రం బాబు ఇచ్చిన హామీలతో సక్సెస్ అవుతారు. ఇదికేవలం తొలి విడత మ్యానిఫేస్టో మాత్రమే. మలి విడత కూడా ఉండనుంది. మరి ఏడాదికి ఎన్ని వేల కోట్ల హామీలు చంద్రబాబు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. హామీలు ఇవ్వడం ఓకే. గ్యారంటీ కూడా సరే. కానీ దాని అమలు మాత్రమే అసలైన ప్రశ్న. తొలుత ఈ విషయంలో చంద్రబాబు ప్రజలను నమ్మించగలిగితే యాభై శాతం సక్సెస్ అయినట్లే. లేకుంటే మాత్రం ఎన్ని హామీలు ఇచ్చినా జనం విశ్వసించరన్నది కూడా అంతే వాస్తవం.