Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆగండి.. మాట్లాడుకుందాం!

brs party troubleshooter

0

ఎవరూ తొందరపడొద్దు.. ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలతో రాయబారం జరుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్​లో తీవ్ర స్థాయిలో అసంతృప్తులు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నాయకుల గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

సవాళ్లు.. ప్రతిసవాళ్లు..
ప్రస్తుతం బీఆర్ఎస్​లో ఒక వర్గం పేరు చెబితే.. మరో వర్గం కస్సుమంటోంది. ఇరువర్గాలు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. పోటాపోటీగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికార పార్టీ చాలా బలంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రెండు, మూడు గ్రూపులుగా చీలిపోయి పనిచేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం గులాబీ పార్టీకి చికాకును కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరిగే నాటికి పార్టీలో అసంతృప్తి ఛాయలు కూడా లేకుండాలన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. ఈ జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మినహా మిగిలిన వారందరికీ తిరిగి టికెట్లు లభించాయి. దీంతో ఎంతోకాలంగా టికెట్ల కోసం గంపెండు ఆశలుపెట్టుకున్న ఆశావహుల్లో ఒక్కసారిగా అసంతప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే నాలుగు రోజులపాటు విభేదాలు కొనసాగినప్పటికీ.. ఆ తరువాత అంతా సర్దుకుంటాయని కేసీఆర్ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితి కొనసాగుతుండడంతో పార్టీ అధిష్టానం ప్రస్తుతం బెంబేలెత్తుతోంది.

పార్టీని వీడుతున్న నేతలు..
బీఆర్​ఎస్​లో టిక్కెట్లు రాని అసంతృప్త నేతలు ఇప్పటికే కొందరు పార్టీని వీడారు. మరికొందరు టాటా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా కొద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు నేతలు తమను కాదని టికెట్ దక్కించుకున్నవారికి ప్రత్యర్థులతో కలిసి వెన్నుపోటు పొడిచేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రహస్యంగా ప్రత్యర్థి పార్టీ నేతలతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. ఈ పరిణామాలను చూసి పార్టీ అధిష్ఠానం ఖంగుతింటోది. ఇప్పటికే కొంతమంది నేతలను పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో హెచ్చరించినా వారు డోంట్ కేర్ అంటున్నారు. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో నష్టం ఉంటుందని భావించిన కేసీఆర్.. అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పార్టీ అధిష్టానం, మంత్రి హరీశ్​రావును రంగంలో దించింది.

అసంతృప్తులకు హరీశ్ రావు ​హామీలు..
కేసీఆర్ ఆదేశాల మేరకు అగమేఘాలపై రంగంలోకి దిగిన మంత్రి హరీశ్ రావు నియోజకవర్గాలవారీగా అసంతృప్త నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది బీఆర్ఎస్సేనని అసంతృప్తులకు మంత్రి నచ్చచెబుతున్నారు. అందువల్ల పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలందరికీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తున్నారు. అంతేతప్ప పార్టీ కాదని పక్క చూపులు చూడొద్దని నచ్చచెబుతున్నారు. ఇలా మంత్రి హరీశ్ రావు ఇప్పటికే సుమారు 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆశావహుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగిపోయేలా నేతలకు ఆయన హామీలను కూడా ఇస్తున్నారని గులాబీవర్గాల్లో వినిపిస్తోంది. కొందరికి అయితే ఒకటి, రెండు రోజుల్లోనే అతిముఖ్యమైన నామినేటెడ్ పోస్టులను ఇస్తామని ప్రామిస్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. మరి కొందరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో కొందరు నేతలు మొత్తబడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థి గెలుపు బాధ్యతను కూడా సదరు నేతపైనే మంత్రి హరీశ్ రావు పెడుతున్నారని ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే టికెట్ దక్కించుకున్న నేతలతో కూడా మాట్లాడుతున్నారు. ఆశావహులందరినీ కలుపుకుని ఎన్నికల ప్రచారం సాగించాలని హరీశ్ రావు సూచిస్తున్నారు. ప్రతిరోజు నాయకులను పిలిచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ కేటీఆర్ వచ్చాక తుది నిర్ణయం అంటూ బుజ్జగిస్తున్నారు హరీశ్​రావు. మొత్తం మీద హరీశ్ రావు రంగ ప్రవేశంతో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తిలు చక్కపడుతున్నాయని తెలుస్తోంది.

6న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక..
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 6న హైదరాబాద్ రానున్నారు. ఆయన రాకకోసమే పార్టీలోని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. చిన్న బాస్ నగరానికి రాగానే పార్టీలో అనేక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో అసంతృప్తితో ఉన్న చాలా మంది నేతలు.. కేటీఆర్ రాక కోసం ఎంతో ఆతృతతో నిరీక్షిస్తున్నారు. చాలాచోట్ల రెబల్స్ బ్యాచ్ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా రామగుండం టికెట్ ను కోరుకంటి చందర్ కు మళ్లీ కేటాయించారు. అయితే అక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన సుధారాణి బ్యాచ్.. అవసరమైతే ఇండిపెండెంట్ గానే సై అంటూ వేరే గుర్తు కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక అదే బాటలో పటాన్‌చెరులో నీలం మధు, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నట్లు సమాచారం. అధిష్టానం వారితో సంప్రదింపులు జరిపినా కేటీఆర్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కోదాడలో శశిధర్‌రెడ్డికి టిక్కెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేటీఆర్‌ రాకతో ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పడుతుందని అధిష్ఠానం భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie