బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ముంబైలోని బీఎంసీలో ఒక స్టార్ హోటల్ నిర్మించనున్నాడు. ఇందుకోసం బీఎంసీ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడు సల్మాన్. అయితే ముందు ఇక్కడ రెసిడెన్షియల్ సొసైటీని ఏర్పాటు చేయాలనుకున్నాడు కానీ.. ఇప్పుడు హోటల్ కట్టడంపై దృష్టి పెట్టాడు. ఇది ముంబైలోని బాంద్రా కార్టర్ రోడ్‌లో 19 అంతస్తుల్లో విలాసవంతంగా నిర్మించబడుతోంది. ఇక హోటల్ ను సల్మాన్ ఖాన్ తన తల్లి సల్మా ఖాన్ పేరు మీద తీసుకున్నాడు.
ముంబైలోని బాంద్రాలో సముద్ర ప్రాంతానికి ఎదురుగా ఉండనున్న ఈ హోటల్‌లో మొత్తం 19 అంతస్తులు ఉంటాయి. బ్లూప్రింట్ ప్రకారం.. హోటల్ మొదటి, రెండవ అంతస్తులలో ఒక కేఫ్, రెస్టారెంట్ ఉంటుంది. మూడో అంతస్తులో జిమ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నాలుగో అంతస్తు సర్వీస్ ఫ్లోర్‌గా, 5, 6 అంతస్తులలో కన్వెన్షన్ సెంటర్ ఉండనుంది. ఏడో అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు హోటల్ నిర్మిస్తారు. అత్యాధునిక హంగులతో నిర్మితం కానున్న ఈ హోటల్‌లో.. సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ హోటల్ కోసం ప్రతినెలా రూ.1.5 లక్షలు చెల్లించనున్నాడు సల్మాన్.