ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులు ఎవరూ లేరు. అందరూ మిత్రులే. జనసేన పార్టీ నేరుగా పొత్తులో ఉంది. కానీ అది పేరుకే. కానీ కలిసి పోటీ చేస్తామని మాత్రం చెప్పడం లేదు. దేశం కోసం బీజేపీకి మద్దతిస్తామని .. వైఎస్ఆర్‌సీపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు వచ్చి తీవ్ర విమర్శలు చేసినా వారు బీజేపీకే మద్దతంటున్నారు. బీజేపీ పెద్దలు అన్న మాటల వారివి కావని.. టీడీపీ మాటలని కవర్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో సఖ్యతగా ఉంటోంది కానీ.. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. దీంతో ఏపీ బీజేపీ అర్థం కాని రాజకీయం చేయాల్సి వస్తోంది.
దీంతో ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతోంది. భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే విషయంలో పవన్ కల్యాణ్ అంత ఆసక్తిగా లేరు. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడటం లేదు. కానీ గతంలో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని.. ఒప్పుకోకపోతే ఒప్పిస్తామన్న ప్రకటనలు కూడా చేశారు. అయితే ఒక్క బీజేపీతో కలిసి పోటీ చేసే విషయంలో ఆయన సానుకూలంగా లేరు. అాలా ఉంటే ఈ పాటికి రెండు పార్టీలు కలిసి రాజకీయ ప్రయాణం చేస్తూ ఉండేవి. పైగా ముస్లింలతో మాట్లాడినప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు బీజేపీ వైపు నుంచి ఇబ్బంది వస్తే.. తాను ఊరుకోనన్నారు. అవి ఎలాంటి ఇబ్బందులో చెప్పలేదు కానీ.. ఆ పార్టీతో ఉంటే ముస్లింలు ఓట్లు వేయరన్న అభిప్రాయం మాత్రం పరోక్షంగా వ్యక్తం చేశారని అనుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ విషయంలో టీడీపీ వ్యతిరేకంగా లేదు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు చేయలేదు కాబట్టి వ్యతిరేకించి .. పోరాటం ఆ పార్టీ మీదే అన్నట్లుగా రాజకీయ వ్యూహం అమలు చేశారు. అది రివర్స్ అయింది. ఇప్పుడు ఆ పార్టీపై పోరాడాల్సిన అవసరం కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు సానుకూలంగా మాట్లాడుతున్నరు. కానీ పొత్తుల దగ్గరకు వచ్చే సరికి స్పందించడం లేదు. బీజేపీకి ప్రస్తుతం ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. అందుకే.. సీట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని అనుకుంటున్నారు. కానీ బీజేపీ మద్దతు కోరుకుంటున్నారు.
మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు.. వైసీపీ విషయంలో సానుకూలంగా ఉండకుండా న్యూట్రల్ గా ఉండాలంటున్నారు. బీజేపీ నుంచి టీడీపీ ప్రస్తుతం కోరుకుంటున్నది అదే. ఇక బీజేపీ పెద్దలు తీవ్రమైన ఆరోపణలు చేసినా సరే.. తాము బీజేపీకే మద్దతు ఇస్తాం అనే రాజకీయ చక్రబంధంలో వైఎస్ఆర్‌సీపీ ఉంది. షరతుల్లేకుండా మద్దతిస్తున్న తమపై బీజేపీ ఎటాక్ చేయదని గట్టి నమ్మకంతో ఉన్నారు. విమర్శలు ఎన్ని చేసినా.. పాలనా పరంగా సహకరిస్తారని అనుకుంటున్నారు.
హెచ్ఐవి, ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు.
ఈ విషయంలో బీజేపీ ఇప్పటి వరకూ వైసీపీని ఇబ్బంది పెట్టలేదు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ దూరమయ్యే ప్రమదం ఉంది. ఎలా చూసినా ఏపీలో బీజేపీని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అందరూ అభిమానిస్తున్నారు. కానీ అది ఓట్లు వేయడానికి కాదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని చూసి. అయితే ఈ రాజకీయ పద్మవ్యూహంలో ఎలా ముందుకెళ్లాలో బీజేపీ తేల్చుకోలేకపోతోంది.