ముద్ర సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, లకు తక్షణమే కాల్ చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి లేదా సోషల్ మీడియా గ్రూప్స్ లో అధిక లాభాలు ఆశ చూపించే మెసేజెస్ నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని చెప్పారు. జిల్లా పరిధిలో ఏరకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అని అన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మవద్దని సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరాలు చేస్తున్నారు అని వివరించారు.
ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది అని, అలాగే ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కాని, పాన్ కార్డు కాని, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు అని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుంది అదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా దోచేస్తున్నారు కావున మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు అని తెలిపారు.