- తాజా రాజకీయాలపై చర్చ
- పార్టీలో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన
- రాజాసింగ్ పై వేటు ఎత్తివేయాలని కోరిన సంజయ్
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలిశారు. సోమవారం ఢిల్లీలో పార్లమెంట్ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. తెలంగాణ తాజా రాజకీయాల గురించి చర్చించారు.
ఆరోపణలపై వివరణ..
అమిత్‌షాను కలిసిన బండి.. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు కూడా తనపై ఫిర్యాదులు అందజేశారని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వారు గెలిచారని, అయినా వాళ్లేందుకు ఫిర్యాదులు చేశారో తెలియదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని బండి ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగానే తనపై తప్పుడు నివేదికలను పంపించారని వెల్లడించారు. తనవైపు తిరిగిన నేతలంతా కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని చెప్పారు. వారిని గుర్తించాలని కోరారు. గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ పై ఏడాది కాలంగా ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని బండి కోరారు.
పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి: షా
బండి సంజయ్వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షా, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, పార్టీలోని అంతర్గత వివాదాలపై మీడియా వేదికగా మాట్లాడవద్దని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి కోల్పోయిన తర్వాత కేంద్రమంత్రి అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే తొలిసారి. దీంతో వీరిద్దరి భేటీపై రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చానీయంశంగా మారింది. బండి సంజయ్‌కు కీలక పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ను పార్టీకి వాడుకోవాలని అధిష్ఠానం కూడా యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా బండి సంజయ్ తనను కలిసినట్లు కేంద్రమంత్రి అమిత్ షా స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. అమిత్ షా మార్గదర్శకంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
బీజేపీ వ్యూహరచన..
2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లతోపాటు ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై బీజేపీ వ్యూహరచన చేస్తుంది. జూలై మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల నేతలకు దిశా నిర్దేశం చేశారు. దక్షిణాదిలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంస్థాగత మార్పులకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే బండి సంజయ్ ను తప్పించారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.