Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ ఆఫీసు పరిశీలించిన బాబు

0

విజయవాడ, ఫిబ్రవరి 24:గన్నవరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో ధ్వంసమైన తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని, తగలబెట్టిన వాహనాలను పరిశీలించారు.  దాడి వివరాలను పార్టీ నేతలు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. దాడులకు గురైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శలు, పర్యటనవ తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ… వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులతో కలిసి వచ్చి, వారి సహకారంతో దాడులు చేయడం కాదని సూచించారు. ప్రత్యర్థులకు దమ్ముంటే టైం ఫిక్స్ చేసి ఎన్ని వేల మందితో వస్తారో రావాలని సవాల్ చేశారు. తేల్చుకోడానికి తాము సిద్ధమేనని చంద్రబాబు హెచ్చరించారు.

పోలీసుల్ని పక్కన పెట్టి ముందుకు వస్తే అక్కడే తేల్చుకుందామన్నారు. గన్నవరంలో పోలీసులు దొంగల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఘటనా స్థలానికి బాధితుల కోసం ఆన్‌డ్యూటీలో వచ్చిన అడ్వకేట్‌ పై కూడా కేసు పెట్టారని అన్నారు. పోలీసుల్ని రెచ్చగొట్టి ఇప్పుడెవరు తప్పులు చేసినా… చివరకు పోలీసులకే శిక్షపడుతుందని హెచ్చరించారు. బెదిరిస్తే పారిపోయే పార్టీ తమది కాదని అన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడాన్ని ఖండించారు చంద్రబాబు. తాను ఎయిర్ పోర్టుకు వస్తే 1000 మంది పోలీసులను పెట్టారని .. గన్నవరం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అసలు దాడులే జరిగేవి కాదన్నారు.

గన్నవరం సిఐ బీసీ వర్గానికి చెందినవాడైతే అట్రాసిటీ కేసులు ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే ఈ ఘటనలపై ఎంక్వైరీ వేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఎప్పుడు అడ్డుకోలేదన్నారు.పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన వారిపై ఇప్పటి వరకు విచారణ స్టార్ట్ చేయలేదన్నారు చంద్రబాబు. బాధితులు టీడీపీ వాళ్లైతే వాళ్ల మీదే కేసులు పెట్టారని, పోలీసుల తీరు చూసి అంతా సిగ్గుతో తలదించు కుంటున్నారన్నారు. పోలీసులు చేసిన సిగ్గుమాలిన పనిని వారి ఇళ్లలో కుటుంబ సభ్యులు సమర్థిస్తే తాను కూడా సమర్థిస్తానని చెప్పారు. రాష్ట్రంలో సైకో పాలనపోయే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. టీడీపీ కార్యాలయం మీదే కదా దాడి అని వదిలేస్తే భవిష్యత్‌లో ఎవరికి రక్షణ లేకుండా పోతుందని హెచ్చరించారు చంద్రబాబు. ప్రభుత్వం మీద పోరాడటానికి ప్రజలే ముందుకు రావాలన్నారు.

రాష్ట్రంలో ఉన్న పాలనను తరిమి కట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గెలిపించుకున్న వారినే కొట్టించిన ఎమ్మెల్యేను అంతా గుర్తు పెట్టుకోవాలని, వడ్డీతో సహా తిరిగి చెల్లిద్దామన్నారు. మళ్లీ మంచిరోజులు వస్తాయని కార్యకర్తలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. గన్నవరంలో టీడీపీ శ్రేణుల్ని కాపాడుకుంటానని చెప్పారు చంద్రబాబు. ప్రజలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. విమర్శలకు సమాధానాలు చెప్పాలని, చేతకాని వాళ్లే ఇలా దౌర్జన్యాలు చేస్తారని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని దాడులు చేస్తారని ఎద్దేవా చేశారు. గన్నవరంలో జరిగిన దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని, టెర్రరిస్ట్‌లు కూడా అలా చేయరని, గన్నవరం ప్రజలందరిని భయభ్రాంతులు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie