- బీఆర్ఎస్ అభ్యర్థులను వీడని గుబులు
- తొలి జాబితాలో చోటు దక్కినా తొలగని టెన్షన్
- చివరి నిమిషం వరకు పొంచి ఉన్న ప్రమాదం!
- అధినేత హెచ్చరికతో అందరూ అప్రమత్తం
- ఏ క్షణంలోనైనా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం
- పార్టీ వర్గాలలో జోరుగా సాగుతున్న ప్రచారం
- ఇంకా ఆశలు వదులుకోని ఆశావహులు
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్ గుబులు పట్టుకుంది. తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ వారిలో టెన్షన్ మాత్రం వీడడం లేదు. ఇప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడంతో నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణకు ఇంకా చాలా రోజులు గడువు ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో టిక్కెట్ల కోసం రచ్చరచ్చ జరిగింది. పలువురు సిట్టింగ్ శాససనభ్యులకు ఈ దఫా టికెట్లు వచ్చే అవకాశం లేదని పార్టీలో చాలా మంది నాయకులు, ఆశావహులు భావించారు. కానీ, కేసీఆర్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏడుగురు సిట్టింగ్ శాసనసభ్యులను మాత్రమే మార్చారు. మిగిలిన వారికి లైన్ క్లియర్ చేశారు. వీరిలో కొందరు శాసనసభ్యులపై పలు రకాల ఆరోపణలు బలంగా వచ్చాయి. మరికొందరు శాసనసభ్యులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి కేసీఆర్ కు నివేదికలు అందాయన్న ప్రచారం కూడా వినిపించింది. అలాంటి స్థానాలలో సిట్టింగులను మార్చడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, వాటిని కేసీఆర్ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వారందరికి తొలి జాబితాలో చోటు కల్పించారు.
ఆశావహులలో నిరాశ
దీంతో పలు నియోజకవర్గాలలో టికెట్ల పై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ప్రధానంగా కేటీఆర్ కు అత్యంత దగ్గరి నాయకులకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు లభించ లేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని త్వరలోనే హైదరాబాద్ కు రానునున్నారు. కేటీఆర్ నగరానికి రాగానే ఆశావహులంతా ఆయనను కలిసి టికెట్ల పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకరావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి పలు నియోజకవర్గాల నుంచి ఈ ఒత్తిళ్లు మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో అనివార్య పరిస్థితులలో ప్రస్తుతం తొలి జాబితాలో చోటు కల్పించిన నేతలకు బీ ఫామ్ ఇస్తారా? అన్నది ప్రస్తుతం అనే రకాల అనుమానాలకు తావిస్తోంది. ఇదే ప్రస్తుతం అభ్యర్థులకు టెన్షన్ కు గురి చేస్తున్నది. ఈ దఫా టికెట్ లభిస్తుందన్న ధీమాతో పార్టీ కోసం పెద్దఎత్తున డబ్బులు కూడా వెచ్చించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా పార్టీ అధిష్టానం నుంచి గతంలో హామీ లభించింది. ప్రస్తుతం వారికి అనివార్య పరిస్థితులలో టికెట్లు ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో సదరు నేతలంతా టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. చివరి నిమిషంలోనైనా కేసీఆర్ మనస్సు మారకపోతుందా? తమకు టికెట్ లభించకపోతుందా? అన్న అశతో ఉన్నారు.
ఆయన ఉంటారా? మారతారా!
ఇదిలా ఉండగా మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మల్కాజిగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావుకు తొలి జాబితాలో చోటు దక్కింది. అయితే, పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడిందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని బరిలోకి దించనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు మైనంపల్లిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారని తెలుస్తోంది.
సిద్ధిపేటలో అయిన దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. మైనంపల్లిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆయనకు చివరి నిమిషం వరకు బీ ఫామ్ ఇస్తారా? ఇవ్వరా? అన్నది ప్రస్తుతం పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు ఆశావహులు తిరిగి తమ వంతు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో టికెట్లు ఆశిస్తున్న నేతలంతా మళ్లీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పులు, చేర్పులు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. మొత్తం మీద తొలి జాబితాలో 115 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, చివరి నిమిషం వరకు బీ ఫామ్ గుబులు మాత్రం వీడడం లేదు.