ఏపీ రాజకీయాలలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఘట్టం వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ప్రచార పర్వానికి పరోక్షంగా శ్రీకారం చుట్టపోతోందని చెప్పాలి. ఎన్నికలు ఇంకా సుదూరంలో ఉండగానే వారాహి విజయ యాత్ర పేరిట జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. నిజానికి అసెంబ్లీ సమావేశాలకు దూరమైన తర్వాత తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ ప్రజల్లో మమేకం అవ్వడమే మార్గమని భావించారు. దానికి అనుగుణంగా జనవరి చివరి వారంలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
గత ఐదు నెలలుగా నారా లోకేష్ పాదయాత్ర రాయలసీమ ప్రాంతంలో కొనసాగి తాజాగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో తన పాదం మోపేలా లోకేష్ పాదయాత్ర రోడ్డు మ్యాప్ రెడీ చేసుకుని మరీ ప్రారంభించారు. అలా దాదాపు 5 నెలలపాటు రాయలసీమలోని ప్రతి మండలాన్ని స్పృశించారు నారా లోకేష్ అదొక వైపు కొనసాగుతుండగానే వివిధ సందర్భాలు పలు అంశాలు తెరమీదికి వచ్చినప్పుడు ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల్లో పర్యటిస్తూనే ఉన్నారు.
ఏపీలో విస్తరించిన రుతుపవనాలు.. అంతంతమాత్రంగానే వర్షాలు.
ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇకపై మరొక ఎత్తు అన్న విధంగా ఇప్పుడు జనసేన అధినేత వారాహి విజయ యాత్రకు పూనుకున్నారు. విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ రెడీ అయినట్టు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంటే నిర్ణీత సమయం ప్రకారం ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఇంకా పది నెలల గడువుంది. ఒకవేళ కొంతమంది ఊహిస్తున్నట్లు 2023 ఏడాది చివరిలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే దానికి అనుగుణంగా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించే రకంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కనిపిస్తుంది.
అత్యంత పటిష్టంగా రూపొందించిన బుల్డోజర్ లాంటి వారాహి వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు జనసేనాని. వారాహి విజయ యాత్ర ప్రారంభానికి ముందు అమరావతి పరిధిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో రెండు రోజులపాటు యజ్ఞ యాగాదులను కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించడం విశేషం. మునుముందు ఎలాంటి అవరోధాలు లేకుండా ఒకవైపు తన విశ్వాసాల మేరకు యజ్ఞాలు నిర్వహిస్తూనే.. ఇంకొక వైపు పార్టీలో ఉన్న అనుభఙ్ఞుల మేరకు వ్యూహాత్మకంగా యాత్ర రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ తాను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నట్లు తన సామాజిక వర్గాన్ని ముందుగా ఆకర్షించేందుకు చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారాహి విజయ యాత్ర కూడా వ్యూహాత్మకంగా ఉభయ గోదావరి జిల్లాలలో నిర్వహించబోతున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు పది రోజులపాటు ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగబోతోంది ఉదయం షెడ్యూలులో రైతులతోనూ, యువతతోను సంభాషించబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు.
సాయంత్రానికి ఒకరోజు స్ట్రీట్ మీటింగ్స్.. ఇంకొకరోజు బహిరంగ సభలను నిర్వహించేలా ప్రణాళిక రచించారు జనసేన వ్యూహకర్తలు. జూన్ 21న గాని, 23న కానీ అమలాపురం కేంద్రంగా భారీ బహిరంగ సభకు జనసేన ప్లాన్ చేసింది. మధ్యలో బ్రేక్ తీసుకుంటూ విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయం కీలకంగా నుండి ఈ నేపథ్యంలోనే జనసేనకు పట్టున్న నియోజకవర్గాలను గుర్తించి దానికి అనుగుణంగా టిడిపి, బిజెపిలతో బేరసారాలకు సమాయత్తం కావాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పర్యాటక ప్రదేశంగా స్మృతివనం విగ్రహం చుట్టూ హరితహారం.
తెలుగుదేశం పార్టీ సైతం ముందస్తు ఎన్నికలను అంచనా వేస్తోంది. దానికి అనుగుణంగా అధినేత చంద్రబాబు జిల్లాలలో పర్యటిస్తున్నారు. గత ఐదు నెలలుగా టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల్లో సంచరిస్తున్నారు. పలు దఫాలలో ఆయన అధికార వైసీపీ నేతలకు సవాళ్లు విసిరారు. పనిలో పనిగా వైయస్ జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే విషయంలో చంద్రబాబు అమరావతి కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ సీనియర్ నాయకులను సమయత్తపరుస్తున్నారు.
పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూసుకునే జాగ్రత్త పాటిస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా జనసేనతో కలవబోతున్న సంకేతాలను చాలా కాలంగా ఇస్తున్నప్పటికీ తాజాగా ఉన్నట్టుండి న్యూఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నేత అమిత్ షా తో భేటీ అయి రావడం ఏపీ రాజకీయాలలో కలకలం రేపింది. చాలా కాలంగా బిజెపి అధినాయకత్వాన్ని కలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాధ్యపడలేదు. తాజాగా జరిగిన భేటీకి ఎవరు చొరవ చూపారు అన్న విషయం పక్కన పెడితే బిజెపి-టిడిపి దగ్గర కాబోతున్నాయన్న సంకేతాలు చంద్రబాబు-అమిత్ షా-జెపి నడ్డాల సంయుక్త భేటీ తర్వాత బలపడ్డాయి.
మునుముందు ఏపీలో టిడిపి-జనసేన-బిజెపి కలిసి కూటమిగా మారబోతున్నాయి అన్నది దాదాపు ఖరారు అయ్యింది. తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన కామెంట్స్ కూడా ఇందుకు దోహదపడ్డాయి. పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చిన జగన్ మనకు అండగా బిజెపి కూడా రాకపోవచ్చు అని సెలవిచ్చారు. తద్వారా ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలను ఒంటిచేత్తో ఎదుర్కొంటానన్న ధీమాను జగన్ వ్యక్తం చేశారు.నిజానికి విపక్ష పార్టీలు ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొని జిల్లాల్లో పర్యటిస్తూ ఉంటే అధికార పార్టీ గత నాలుగు సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకుని వెళుతుంది.
వారంలో కనీసం రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తూ.. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తూ తనను మరోసారి ఆశీర్వదించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తరచూ పత్రికా సమావేశాలను నిర్వహించి గత నాలుగేళ్ల అభివృద్ధి అంశాలను వెల్లడిస్తున్నారు. తద్వారా ప్రజలకు తాము సాధించిన ప్రగతిని వివరించి మరోసారి ఎన్నికల్లో విజయం తనకే కట్టబెట్టాలని ప్రజలను కోరే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. కొందరు ఊహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగితే దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు అవగతం అవుతోంది. మరి ముందస్తు ఎన్నికలు వస్తాయా లేక సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయా అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.