టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏపీ హైకోర్టులో నోటీసులు
టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల నియామకంపై పూర్తి వివరాలను అందజేయాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పాలకమండలిలో నేర చరిత్ర నేపథ్యం కలిగిన వారికి సభ్యత్వం కల్పించారన్న పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయశాఖ కమిషనర్, టీటీడీ ఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేర చరిత్ర ఉన్న వ్యక్తులను టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించడంపై విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ పిల్ ను హైకోర్టు స్వీకరించింది. జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ రఘునందన్ రావు కూడిన ధర్మాసనం విచారించింది. దేవాదాయ చట్టాలకు వ్యతిరేకంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నియామకం చెల్లదంటూ పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జయ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోలను వివరణ కోరింది. పాలక మండలి సభ్యుల నియామకంపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.