హైదరాబాద్, ఫిబ్రవరి 15: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి స్వీటీ అనుష్క శెట్టి చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న వింత ససమస్య గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందాల తార అనుష్కను అత్యంత అరుదైన సమస్య వేధిస్తోందట. ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే సుమారు అరగంట పాటు నవ్వుతూనే ఉంటుందట. తన నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది.
“తన దగ్గర ఎవరైన జోక్ వేసినా, నవ్వించే విషయం చెప్పినా నవ్వు పరిమితికి మించి వస్తోంది. నేను ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే ఆపడం సాధ్యం కావడం లేదు. సుమారు పావు గంట నుంచి అరగంట దాకా నవ్వుతూనే ఉంటాను. ఈ సమయంలో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి తినేసి వస్తారు. నవ్వును కంట్రోల్ చేయలేక చాలా సతమతం అవుతున్నాను” అని అనుష్క తనకున్న అరుదైన సమస్య గురించి వెల్లడించింది.అయితే, అనుష్క చెప్పిన సమస్య ఆమెను సీరియస్ గానే వేధిస్తోందా? లేక కావాలని కామెడీగా చెప్పిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా జస్ట్ కామెడీగా చెప్పిందని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతసేపు నవ్వితే ఏంటి? నవ్వడం ఆరోగ్యానికి మంచిదే కదా అంటున్నారు.
నువ్వు ఎంతసేపు నవ్వినా మాకు ఆనందమే అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అనుష్కకు ఉన్న ఈ అరుదైన సమస్య గురించి త్వరలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.ఇక ‘బాహుబలి’ సిరీస్ తర్వాత చాలా తక్కువగా సినిమాలు చేసింది అనుష్క. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. మైత్రి మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.తాజాగా మరోనటి రేణు దేశాయ్ సైతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.”గత కొంత కాలంగా నేను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా మాదిరిగానే ఎవరైనా బాధపడుతుంటే? వారిలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. జీవితం మీద నమ్మకం అనేది ఉండాలి. ఏదో ఒక రోజు మన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచం మనకోసం ఏదో ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటుంది. అందుకే సమస్య ఏదైనా నవ్వుతూ ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాను. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని షూటింగులకు హాజరవుతాను” అని వెల్లడించింది.