న్యూఢిల్లీ ఏప్రిల్ 28:దేశరాజధాని ఢిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మే 3న కురార్పణతో ప్రారంభమై, మే 13న పుష్పయాగంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మే 8న స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుందన్నారు.
భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆలయంలో లడ్డు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలో ఏపీ,తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భవన్‌లలో సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు కూడా ఉన్నాయన్నారు. శ్రీవారి ‘చక్రస్నానం’ యమున ఘాట్‌లో జరుగుతుందని వెల్లడించారు.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. యాగశాల నిర్మాణం పూర్తయిందని.. మే 8న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలకే పరిమితం చేయమని సూచించారన్నారు.
అందుకే ఇది వరకటిలా ఇతర ఆలయాల కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో టీటీడీ సమాచార కేంద్రాన్ని కొవిడ్ కారణంగా తీసివేశామని.. టీటీడీ చైర్మన్, ఈఓతో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించే ఏర్పాటు చేస్తామన్నారు. జమ్ములో టీటీడీ ఆలయ నిర్మాణం జూన్ నాటికి పూర్తవుతుందని.. జూన్ 3 నుంచి 6 మధ్యలో ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. జమ్ము టీటీడీ ఆలయంలో జూన్ 3న కుంభాభిషేకంతో మొదలై 8న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.