ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య కాలంలో కొత్త నినాదం ఎత్తుకున్నారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నారు. క్లాస్ వార్ లో ఎవరు ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలని పదే పదే చెబుతున్నారు. ఈ డైలాగు పేదలను ఆకట్టుకునేందుకే కావచ్చు. కానీ పెత్తందార్లు కూడా హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. నిజానికి పేదలందరూ గంపగుత్తగా ఓట్లేసే అవకాశాలు తక్కువ. మెజారిటీ ఓట్లు దక్కవచ్చు. లేకుంటే అదీ లేదు. ఎందుకంటే ప్రస్తుత ఎన్నికలు మద్యం, డబ్బుతో పాటు కులం కూడా పనిచేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే పథకాలను పేదలకు ఇస్తూ జగన్ ప్రజా ధనాన్ని పప్పు బెల్లాలుగా మార్చారన్న కామెంట్స్ కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రధానంగా రెడ్డి సామాజికవర్గంలో పదవులు దక్కక అనేక మంది అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేరిట నామినేటెడ్ పదవులను పంచుతుండటం, నామినేటెడ్ కాంట్రాక్టు పనులను కూడా వారితో పాటు మహిళలకు అప్పగిస్తుండటంతో ఒకింత ఆగ్రహంతో పెద్దరెడ్లంతా ఉన్నారు. మొన్న తిరుగుబాటు చేసిన ముగ్గురిలో ఇద్దరు రెడ్లే కావడం ఇందుకు ఉదాహరణగా కొందరు చెబుతున్నారు. అయితే పోలింగ్ రోజు పేదలే పోలింగ్ బూత్‌ల వద్దకు వస్తారని, పెత్తందారులు ఎవరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరన్న కారణంతోనే జగన్ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గంతో పాటు మరి కొన్ని వర్గాలు కూడా జగన్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.
వారు బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ, వివిధ రూపాల్లో వారు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ తీరును కొందరు అభ్యంతర పెడుతూ పోస్టులు పెడుతున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం జగన్ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడం కోసమే పాకులాడుతున్నారన్న పోస్టులు ఇటీవల కాలంలో ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రధానంగా బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, క్షత్రియ సామాజికవర్గం నుంచి జగన్ కు కొంత వ్యతిరేకత కనపడుతుంది. అయితే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియకున్నా కొంత వ్యతిరేకత అయితే ఉందన్న అంచనా వినపడుతుంది.ఇక ఉద్యోగ వర్గాలు కూడా తమకు జీతాలను సకాలంలో చెల్లించకుండా పథకాలకు పంచిపెడుతున్నారన్న అసంతృప్తిలో ఉన్నారు.
జీతాలను ఒకటోతేదీన చెల్లించకపోవడం, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఈ ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడంతో ఇప్పటికే ఉద్యోగస్థులు ఉద్యమ బాట పట్టారు. మరోవైపు ఏసీబీ దాడులు సయితం వారికి ఇబ్బందికరంగా మారాయి. వాలంటీర్ల వ్యవస్థతోనూ కొన్ని శాఖల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, ఉపాధ్యాయ వర్గాలు మాత్రం జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయన్నది పలు సందర్భాల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఈసారి పేదల ఓట్లు ఎటు? అన్న టాపిక్ అయితే మాత్రం ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా నడుస్తుంది.
మరో వైపుమచిలీపట్నంలో కూడా పోటాపోటీగా జనసేన, వైసీపీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్ ల పల్లకీని పవన్ కల్యాణ్, ఇతరులు మోస్తున్నట్లుగా వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. వీటికి పోటీగా జగన్‌ను పల్లకీలో మోస్తున్న అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో భారీ ఫ్లెక్సీలను జన సైనికులు పెట్టారు. కోనేరు సెంటర్, బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బ్యానర్లను అధికారులు, పోలీసులు తొలగించారు. అయితే వైసీపీ బ్యానర్లను మాత్రం అధికారులు టచ్ చేయలేదు. మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జన సైనికులకు, మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులను అడ్డం పెట్టుకుని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో కూడా వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లిలో వైసీపీ, జనసేన పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నాయి. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేరుతో బ్యానర్లు వెలిశాయి. దీంతో సీఎం జగన్ పేరుతో జనసైనికులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.