అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని టార్గెట్ చేస్తూ కరపత్రాలు స్థానికంగా కలకలం సృష్టించాయి. మూడో విడత ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేటితో మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర పూర్తి కానున్న నేపథ్యంలో గన్నెవారి పల్లి కాలనీలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కి వ్యతిరేకంగా కరపత్రాలు స్థానికంగా కలకలం గా మారాయి. ఆ కరపత్రాల లో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక అంశాలు ఉన్నాయి. ప్రతి రోజు జేసీ సోదరులను తలచుకోకపోతే నీకు నిద్ర పట్టదు పెద్దారెడ్డి అంటూ టార్గెట్ చేశారు. పెద్దారెడ్డి ప్రజల కోసం తాను ఏం చేశారు అనేది చెప్పుకోవడం లేదని, ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు అంటూ విమర్శించారు. దోచుకోవడం గురించి పెద్దారెడ్డి మాట్లాడడం బాగోదని కరపత్రాలలో ఎద్దేవా చేశారు.
దీంతో కరపత్రాలను గురించి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈ పని చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రత్యర్థులు ఈ విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు గెలవరని భావించి, ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై చర్చ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
కరపత్రాల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉంటే తాడిపత్రిలో కరపత్రాల పంపిణీ గురించి అలర్ట్ అయిన పోలీసులు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా కరపత్రాలను ఎవరు వేశారు అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారం ముందు ముందు ఏ రూపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.