ఎండలతో పాటు నగరంలో కూరగాయల ధరలూ భగ్గుమంటున్నాయి. రైతు బజార్లతో పాటు హోల్‌సేల్ మార్కెట్లలో రేట్లు అమాంతంగా పెరగడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్, మోండా మార్కెట్లతో పాటు సరూర్‌నగర్, మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి లాంటి రైతు బజార్లకు పెద్ద ఎత్తున కూరగాయలు వస్తుంటాయి. శివారులోని మొయినాబాద్, ఇబ్రహీంపట్నంతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు వస్తుంటాయి.
సరూర్‌నగర్ రైతుబజార్‌కు సాధారణంగా నిత్యం 40 క్వింటాళ్ల టమాట, 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు పచ్చిమిర్చి, వంకాయ 30 క్వింటాళ్లు, బెండకాయ 32 క్వింటాళ్లు, క్యారట్ 35 క్వింటాళ్ల వరకు వస్తుంటాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడి లేకపోవడంతో ఇక్కడికి దిగుమతి కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం ఇదే రైతుబజార్‌లో సాధారణ రోజులతో పోల్చితే 40 శాతం దిగుమతి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. రూ. వందకు కిలో టవటా, కిలో పచ్చిమిర్చి కూడా రావడం లేదని సామాన్యులు వాపోతున్నారు.ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతున్నాయంటూ రెండు వారాలుగా వ్యాపారులు చికెన్ ధరను పెంచేశారు.
ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో స్కిన్‌లె్‌స కిలో రూ.280 నుంచి రూ.300 వరకు, లైవ్ కోడి రూ.190 నుంచి రూ.210 వరకు అమ్మారు. దీంతో చాలామంది చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. లైవ్‌ఫిష్ కిలో రూ.180, ఇతర చేపలు రూ.150, కొర్రమీను రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయించడంతో వాటిని తీసుకునేందుకు మార్కెట్లకు భారీగా తరలివెళ్లారు.మండుతున్న ఎండలతోపాటు కొత్త పంట రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని సరూర్‌నగర్ రైతుబజార్ అధికారి స్రవంతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఆగస్ట్ మొదటి వారం వరకు ధరలు ఇలాగే ఉంటాయని, వర్షాలు ప్రారంభమైన తర్వాత అందుబాటులోకి వస్తాయని చెప్పారు.