నోడల్ అధికారిణి కవిత:సిద్దవటం
వినియోగదారులకు డిసిసిబి బ్యాంకులో అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తున్నట్లు నోడల్ అధికారిణి కవిత తెలిపారు. మండలకేంద్రమైన సిద్దవటం డిసిసిబి బ్యాంకులో మంగళవారం వినియోగదారుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గతంలో డిసిసిబి బ్యాంకులో డిపాజిట్లు, రైతు రుణాలు మాత్రమే మంజూరు చేసేవారమ్మన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.1.50 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు మంజూరు చేస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులకు రూ.10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఋణాలను మంజూరు చెయ్యడం జరుగుతుందన్నారు. అలాగే వాహన రుణాలు, గృహ రుణాలు, ఎడ్యుకేషనల్ రుణాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు.
బ్యాంకు మేనేజర్ సుచిత్ర మాట్లాడుతూ సీనియర్ సిటిజెన్లకు డిపాజిట్లపై గరిష్టంగా 7.80 శాతం అత్యధిక వడ్డీ, బంగారు నగలపై 9.2 శాతం తక్కువ వడ్డీతో త్వరతగతిన రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. సిద్దవటం బ్యాంకు గ్రామీణ ప్రాంతంలో ఉండడంతో వినియోగదారులు తమ సొమ్ములను భద్రపరచుకునేందుకు సంవత్సరానికి 850 రూపాయలకే లాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వెంకటసుబ్బమ్మ, సూపర్వైజర్ రాజశేఖర్, సిబ్బంది సంధ్య, నిహారిక తదితరులు పాల్గొన్నారు.