నెల్లూరు, ఫిబ్రవరి 11,
రవాణా శాఖలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. వాహనాల రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి, డ్రైవింగ్ లైసెన్స్ ల వరకు అన్నింట్లోనూ అవినీతికి ఆస్కారం ఉంది. చేయి తడపనిదే పనికాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు నేరుగా ఆఫీస్ కి వెళ్లి పని చేయించుకోవడం కుదరదని దళారీలను ఆశ్రయిస్తుంటారు సామాన్య ప్రజలు. అదే అదనుగా ఆర్టీఏ ఆఫీస్ ల వద్ద తిష్టవేసుకుని ఉండే దళారీలు లోపల కొంతమంది సిబ్బందిని మచ్చిక చేసుకుని తమ పనులు పూర్తి చేసుకుంటుంటారు. చివరకు ఆ భారమంతా ప్రజలపైనే మోపుతారు. లోపల లంచాలు ఇవ్వనిదే పనికాదని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు.ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో కొన్న వాహనాలను నెల్లూరుకి తీసుకొచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారనే ఫిర్యాదుతో పెద్దస్థాయి అధికారులు బలయ్యారు.
ఆ మచ్చ అలా ఉండగానే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. పదే పదే నెల్లూరుకి చెందిన సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఆకాశ రామన్న ఉత్తరాలు అందుతున్నాయి. పలానా మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అసిస్టెంట్ ఎంవీఐలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని, హెడ్ ఆఫీస్ కి ఏజెంట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏజెంట్లు తమకు తాముగా ఈ ఫిర్యాదులు చేయకుండా సామాన్య ప్రజల రూపంలో ఆకాశ రామన్న ఉత్తరాలు రాస్తున్నారు. వెబ్ సైట్స్ లో కంప్లయింట్లు పెడుతున్నారు.నెల్లూరుతోపాటు చాలా చోట్ల ఆర్టీఐ ఆపీసుల్లో ఇలాంటి సమస్య ఉంది. ఫిట్ నెస్ సర్టిఫికెట్లను నిర్ణీత సమయంలోగా వాహనదారులు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా రెన్యువల్ చేయించుకోవాలంటే కచ్చితంగా ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే వాహనదారులు ఇన్సూరెన్స్ చెల్లించడానికి వెనకాడుతుంటారు.
ఈ క్రమంలో దళారీలు రంగప్రవేశం చేస్తుంటారు. ఇన్సూరెన్స్ లేకుండానే దానికి పెట్టే ఖర్చులో సగం ఖర్చుతో పనికానిచ్చేస్తామంటూ నమ్మబలుకుతుంటారు. డూప్లికేట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు చూపించి ఫిట్ నెస్ సర్టిఫికెట్లు తెప్పిస్తుంటారు. ఇటీవల కాలంలో వచ్చిన ఉద్యోగులు దళారీలకు సహకరించడంలేదు. డూప్లికేట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను వారు వెబ్ సైట్ లో సరిచూస్తున్నారు. వెబ్ సైట్స్ లో ఆయా కంపెనీల ఇన్సూరెన్స్ నెంబర్లతో వాటిని పోల్చి చూస్తున్నారు. ఇన్సూరెన్స్ ఒరిజినల్ కాదు అని తేలితే వెంటనే ఫిట్ నెస్ కి కొర్రీలు పెడుతున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న కొంతమంది అధికారులతో దళారీలకు గిట్టుబాటు కావడంలేదు.
దీంతో వారు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు.అధికారులు ఒరిజినల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లకోసం పట్టుబడుతుండటంతో.. దళారీల ఆటలు సాగడంలేదు. దీంతో వారంతా పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎంవీఐలు, అసిస్టెంట్ ఎంవీఐలు వేధిస్తున్నారని ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తున్నారు. వేర్వేరు ఫోన్లనుంచి టోల్ ఫ్రీ నెంబర్లకు కంప్లయింట్ లు పెడుతున్నారు. దీంతో నిజాయితీగా పనిచేస్తున్న సిబ్బంది తమకెందుకీ కష్టాలంటూ ఇబ్బంది పడుతున్నారు. దళారీలు మానసికంగా వేధిస్తున్నా తాము మాత్రం ఉద్యోగానికి ద్రోహం చేయబోమంటున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల వద్దకు వస్తున్న ఫిర్యాదులు ఇప్పుడు సంచలనంగా మారాయి.