జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ.. ద్వారంపూడిని సమర్థిస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభంపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వినూత్న నిరసన తెలుపుతున్నారు. కాపు రిజర్వేషన్ల పోరాటానికి ద్వారంపూడి సహకరించారని అలాంటి వ్యక్తిపై నిందలేయడం ఏమిటని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. దీంతో కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని ముద్రగడ వైసీపీకి తాకట్టు పెట్టారని.. జనసైనికులు మండి పడుతున్నారు. అందుకే.. ఒక్కో కార్యకర్త రూ. వెయ్యి చొప్పున ముద్రగకు మనీయార్డర్ చే్తున్నారు. గోదావరి జిల్లాల్లో దీన్నో ఉద్యమంలా చేపట్టి పెద్ద ఎత్తున ఒక్కొక్కరు రూ. వెయ్యి చొప్పున ముద్రగడకు పంపుతున్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో కాపు ఉద్యమానికి సహకరించారని లేఖలో ముద్రగడ కొనియాడారు. దీంతో కాపు ఉద్యమంలో ముద్రగడతో ప్రయాణించినప్పుడు తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఆ ఉప్మా పంపిన ద్వారంపూడికి డబ్బులు తిరిగి పంపాలంటూ ముద్రగడకు మనియార్డర్లు పంపుతున్నారు. ఉద్యమాన్ని ద్వారంపూడికి తాకట్టు పెట్టిన ముద్రగడ తిరిగి డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం’’ అంటూ జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ వ్యాఖ్యలు చేశారు.
ద్వారంపూడిని సమర్థిస్తూ.. పవన్ ను విమర్శిస్తూ ముద్రగడ లేఖ రాయడంపై ఇప్పటికే కాపు సంక్షేమ సేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి కాపు జాతిని తాకట్టు పెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముద్రగడ పద్మనాభం లేఖ కాపులంతా తలదించుకునేలా ఉందన్నారు. ఆయన స్థాయిని ఆయనే ఈ లేఖతో దిగజార్చుకున్నారని తెలిపారు. జనసేనాధిపతిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను సినీ హీరోగా ప్రస్తావించడం వెనుక కుట్ర అర్ధం అవుతుందని అన్నారు. కాడి పారేసి ఇంట్లో కూర్చున్న ముద్రగడ ఇప్పుడు లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
విశాఖలో అడ్డూ, అదుపు లేకుండా భూ దందా.
కాపు ఉద్యమంలో నష్టపోయున వారిని పరామర్శించారా అంటూ నిలదీశారు. వంగవీటి మోహనరంగా పేరు జిల్లాకు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని కొన్ని కాపు సంఘాలు ముద్రగడను ప్రశ్నిస్తున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి .. పవన్ కళ్యాణ్‌ను, అతని కుటుంబ సభ్యులను బూతులు తిడితే ఎక్కడున్నారని ప్రశఅనించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు మహిళలను కొడితే ఎందుకు ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ ఇవ్వను అన్న జగన్‌కు ఎలా మద్దతు ఇస్తున్నావంటూ కృష్ణాంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ముద్రగడ ఇంకా స్పందించాల్సి ఉంది.