ముద్ర ప్రతినిధి మెదక్: పట్టా పాస్ బుక్ లో తప్పులు సరిదిద్దేందుకు లంచం తీసుకుంటూ ఆర్ఐ, విఆర్ఎ ఏసీబీకి చిక్కిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో సోమవారం చోటుచేసుకుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నెల్లి శ్రీహరి తోపాటు అతనికి సహకరించిన చందంపేట గ్రామ వీఆర్ఏ గూడూరి తలారి సురేష్ బాబు డబ్బులతో పట్టుబడ్డారు. ఎసిబి డి.ఎస్.పి ఆనంద్ కుమార్ వివరాల ప్రకారం… మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన పాపన్నపేట శ్రీనివాస్ గత నెల 5వ తేదీన ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకున్న 1313 సర్వే నంబర్లో గల భూమిలో కొత్త పాస్ బుక్ నందు 22 గుంటల భూమి తక్కువగా వచ్చినందున రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరిని బాధితుడు శ్రీనివాస్ సంప్రదించగా రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. అంతగా డబ్బులు చెల్లించలేనని శ్రీనివాస్ తేల్చి చెప్పడంతో బాధితుని భూమి పక్కనే తన స్థలం ఉన్నదని,18 గజాలు కబ్జాలో ఉన్నట్లు శ్రీహరి శ్రీనివాస్ కు తెలిపారు.
తాను అడిగిన రెండు లక్షల రూపాయలలో 18 గజాల డబ్బులు పట్టుకొని, మిగతా డబ్బులు చెల్లిస్తే పని పూర్తి చేస్తానని శ్రీహరి చెప్పాడు. డబ్బులు చెల్లిస్తాడని ఆశతో పని పూర్తి చేసిన శ్రీహరికి శ్రీనివాస్ డబ్బులు చెల్లించకపోవడంతో డబ్బుల కోసం వేధించసాగాడు. ఎట్టకేలకు లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా శ్రీహరి డిమాండ్ చేయడంతో లక్ష రూపాయలు సిద్ధం చేసుకుని శ్రీనివాస్ ఏసీబీకి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు చందంపేట గ్రామ వీఆర్ఏ సురేష్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరిలను అదుపులోకి తీసుకొని కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు విచారణ చేసిన అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇప్పటికింకా విచారణ కొనసాగుతూనే ఉందని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే తదుపరి చర్యలు చేపడతామని డి.ఎస్.పి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వెంకట రాజ గౌడ్, రమేష్ తదితరులున్నారు.