Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మణిపూర్ లో శాంతి పై చిత్తశుద్ధి లేని కేంద్రం

A center without integrity on peace in Manipur

0
  • ఖనిజ సంపదపై కన్నేసిన మెయితీలు
  • ఎస్ టీ హోదా కోసం ఆరాటం అందుకే

హైదరాబాద్: మణిపూర్ లో విస్తారంగా ఉన్న  ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే అక్కడ హింస చెలరేగుతోందని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) మంగళవారంనాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ‘మెఫి టేక్స్ ‘ కార్యక్రమంలో భాగంగా మణిపూర్ పై ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన  మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. విభజించి పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న ప్రభుత్వాలు చూసీ చూడనట్టుగా  వ్యవహరిస్తుండటం వల్లే హింస మరింత ప్రజ్వరిల్లుతోందని ఆయన అన్నారు. అధికార వర్గాలకు సన్నిహితంగా ఉన్న మెయితీలకు దొడ్డి దారిన ప్రభుత్వ ఆయుధాలు అందుతున్నా స్థానిక పోలీసులు, పారా మిలిటరీ బలగాలు మౌనముద్ర పాటిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

A center without integrity on peace in Manipur

మూడు వేల నుంచి నాలుగు వేల దాకా తుపాకులను, రెండు నుంచి మూడు లక్షల దాకా బుల్లెట్లను మెయితీలు లూటీ చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన భద్రతా దళాలు ‘ అయ్యా… బాబూ.. ఆయుధాలు అప్పగించండి ” అంటూ ప్రాధేయపడటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా    మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోనూ, దాని పరిసర ప్రాంతాల్లోనూ నివసిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులతో ధనికులుగా మారిన మెయితీలు ఇప్పుడు కొండ ప్రాంతాలలోని అటవీ సంపదపై కన్నేశారని హరగోపాల్ చెప్పారు. మెయితీ వర్గాన్ని కూడా షెడ్యూల్డు తెగగా  గుర్తించి వారిని ఆ జాబితాలో చేర్చడానికి చర్యలు చేపట్టవలసిందిగా మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో నిరుపేద ఆదివాసీలైన కుకీ వర్గం వారు ఆందోళనలు ప్రారంభించారని, వారి మీద మెయితీలు దాడులకు తెగబడటంతో హింసకాండ చెలరేగిందని హరగోపాల్ వివరించారు. దాడులను ఆపి శాంతిని నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వాస్తవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించి వచ్చిన తర్వాతనే అక్కడ ఘర్షణలు మరింత ఎక్కువయ్యాయని ఆయన తెలిపారు.

భారతదేశానికి సమాఖ్య వ్యవస్థ పనికిరాదని, విస్తృత అధికారాలతో కూడిన అధ్యక్ష తరహా పాలన మేలని, దేశాన్ని ఎప్పటికైనా హిందూ రాజ్యంగా మార్చాలన్న అర్ ఎస్ ఎస్ లక్ష్యాలను సాధించడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని హరగోపాల్ ఆరోపించారు. గుజరాత్ లో జరిగిన నరమేధం కానీ, ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్న దురాగతాలు కానీ ఆ పథకంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. మణిపూర్ లో జాతుల మధ్య విద్వేషాలను ఆపాలన్న చిత్తశుద్ధిని ప్రభుత్వం కనబరచడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీ కుకీ మహిళలను మెయితీ వర్గానికి చెందిన వందలాది మంది  నగ్నంగా ఊరేగించి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సుప్రీంకోర్టు స్పందించే వరకూ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోవడం విచారకరమని హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ లైన కుకీలకు చెందిన 300 చర్చిలను మెయితీలు కూల్చివేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమానికి మెఫీ ట్రస్టీ, సీనియర్ జర్నలిస్టు, ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) కార్యదర్శి వై నరేందర్ రెడ్డి వందన సమర్పణ చేశారు. మెఫీ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రెస్ క్లబ్ కోశాధికారి ఏ రాజేష్, పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie