తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2023’ నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.