హైదరాబాద్, జనవరి 28,
తెలుగు చిత్రసీమలో శుక్రవారం (జనవరి 27, 2023) ను ఒక చీకటి రోజుగా కొందరు చూసే అవకాశం ఉందని, చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక షాక్ తర్వాత మరోక షాక్… టాలీవుడ్‌ను వణికించిన రోజు ఇది. ఒకానొక దశలో కాసేపటి తర్వాత ఏ వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడ్డారు కూడా! అంతలా ఈ రోజు షాకులు తగిలాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…శుక్రవారం ఉదయం సాధారణంగా కొత్త సినిమాల సందడి నెలకొంటుంది. అయితే, రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, గురువారం సుధీర్ బాబు ‘హంట్’తో పాటు కొన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. దాంతో ఉదయం పెద్ద హడావిడి లేదు. ఇండస్ట్రీ అంతా నిద్ర లేస్తున్న సమయంలో జమున మరణ వార్త అందరికీ షాక్ ఇచ్చింది.చిత్రసీమలో జమున తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. సిల్వర్ స్క్రీన్ సత్యభామగా పేరు పొందారు. ఆమెను అభిమానించే ప్రేక్షకులు, ఆదర్శంగా తీసుకునే కథానాయికలు ఉన్నారు. అటువంటి జమున మృతి చెందడంతో షాక్ తగిలింది. చాలా మంది విషాద వదనంతో సంతాపాలు వ్యక్తం చేశారు.
రెండో షాక్…
శ్రీనివాస మూర్తి మృతి
జమున మరణ వార్త నుంచి కోలుకోక ముందు మరో షాక్ తగిలింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మృతి చెందారని తెలిసి మరింత షాక్ తిన్నారు. ఆయన వయసు తక్కువే. చిన్న వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్ళడం ఎంతో మందిని బాధించింది. ఎన్నో డబ్బింగ్ సినిమాలకు, పరభాషా హీరోలు ఎంతో మందికి ఆయన గొంతు ప్రాణం పోసింది. శ్రీనివాస మూర్తి మరణం వ్యక్తిగతంగా తనకు ఎంతో లాస్ అని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ స్టార్ సూర్య ట్వీట్ చేశారంటే ఆయన ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తారకరత్నకు ఏమైంది?
ఉలిక్కి పడిన ఇండస్ట్రీ…
జమున, శ్రీనివాస మూర్తి మరణాలు జీర్ణించుకోవడానికి ముందు మరొక భారీ షాక్ తారకరత్న రూపంలో వచ్చింది. ఆయనకు ఏమైందోననే ఆందోళన ఇటు సినిమా, అటు రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ తలపెట్టిన ‘యువ గళం’ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్ళిన నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు రావడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. తొలుత డీహైడ్రేషన్ కారణంతో సొమ్మసిల్లి పడినట్టు సమాచారం వచ్చింది. తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్ళగా… పల్స్ లేదని, శరీరం రంగు మారిందని వైద్యులు ప్రకటించడంతో నందమూరి, తెలుగు దేశం పార్టీ అభిమానుల్లో ఆందోళన మరింత ఎక్కువ అయ్యింది. కొంత సేపటి తర్వాత ఆయన ప్రాణాపాయం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ నందమూరి తారక రత్న ఎప్పుడు కోలుకుంటారోనని అందరూ ఓ కంట ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న హెల్త్ బులిటెన్స్ గమనిస్తున్నారు.
బుల్లితెరలోనూ షాక్…
విష్ణుప్రియ తల్లి మృతి
తెలుగు బుల్లితెర పరిశ్రమ ప్రముఖులు సైతం ఈ రోజు ఉదయం విషాద వార్తతో నిద్ర లేచారు. యాంకర్, నటి విష్ణుప్రియ తన తల్లి మరణించారని చెప్పారు. అంతే కాదు… కాసేపు ‘రచ్చ’ రవికి యాక్సిడెంట్ అయినట్లు ప్రచారం జరిగింది. చివరకు, ‘రచ్చ’ రవి క్షేమంగా ఉన్నారని తెలియడంతో హ్యాపీగా ఫీలయ్యారు.
రవి కారుకు యాక్సిడెంట్
కార్ యాక్సిడెంట్ జరిగిన వార్త నిజమే. అయితే, అది ‘రచ్చ’ రవి కారుకు కాదు… సినీ నటుడు ‘జోష్’ రవి కారుకు! విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ ఫైట్ మాస్టర్, నిర్మాత జోడో కె.కె. రత్నం కన్ను మూసిన వార్త కూడా ఈ రోజు బయటకు వచ్చింది.