21 రోజుల పాటు ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు
హైదరాబాద్
రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణపై బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి , సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు.
పదేండ్ల సుదీర్ఘ కాలం పరిపానలో ఓ మరచిపోలేని మైలు రాయి. స్వరాష్ట్రంలో సుపరిపాలన కెసిఆర్ కే ప్రత్యేకం. అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించి సుసాధ్యం చేసిన సీఎం కెసిఆర్, రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను ఓ పండుగలా… మరచిపోలేని ఓ తీపి జ్ఞాపకంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను సీఎం కెసిఆర్ మరచిపోలేని విధంగా ఓ గొప్ప గుర్తుగా మనమందిద్దాం. అందుకు అధికారులు ప్రజలను భాగస్వాములను చేస్తూ, త్రికరణ శుద్ధితో పని చేయాలి. జూన్ 2వ తేదీ నుండి 23వ తేదీ వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను సమున్నతంగా నిలిపే విధంగా ఉత్సవాలు జరగాలని ఆశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, రాష్ట్రావతరణ జరిగి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి. పండుగ వాతావరణంలో రోజుకో కార్యక్రమం చొప్పున మొత్తం 21 రోజుల పాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు తెలిపేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పల్లె పల్లెనా పండుగలా ఏర్పాట్లు
రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు పల్లెపల్లెనా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని, ఆయా గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
గ్రామ గ్రామాన గ్రామ సభలు… పల్లె ప్రగతి నివేదికలు
గ్రామ గ్రామాన గ్రామ సభలు పెట్టాలని చెప్పారు. ఆయా గ్రామ సభల సందర్భంగా ప్రగతి నివేదికలు చదివి ప్రజలకు వినిపించాలన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. ఏయే పథకాలు వచ్చాయి. గ్రామాల్లో ఆయా పథకాల విలువ ఎంత? ఒక్కో పథకం కింద ఒక్కో గ్రామానికి వచ్చిన నిధులు ఎన్ని? మొత్తంగా గ్రామానికి అందిన ప్రగతి ఫలాల మొత్తం ఎంత? అనే వివరాలు ప్రజలకు ప్రగతి నివేదికల రూపంలో వివరించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు.
అభివృద్ధి విజయోత్సవంగా వేడుకలు
గ్రామాల్లో ఈ వేడుకలను అభివృద్ధి విజయోత్సవంగా నిర్వహించాలని మంత్రి చెప్పారు. ఈ పదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాలను ప్రజలు తెలిపేలా ప్రదర్శనలు జరగాలని మంత్రి తెలిపారు. ఆయా అభివృద్ధి పథకాల వివరాలను ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పారు.
ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు
ప్రతి ఇంటి ముందు 10 ఏండ్ల విజయోత్సవాలు ఉట్టిపడేలా… రంగు రంగుల రంగవల్లులను తీర్చిదిద్దాలని, అలా మహిళలను సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. ఇండ్ల ముందు ముగ్గులు, తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలుగా నిలవాలని చెప్పారు.
గ్రామాల్లో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహిళలకు, మహిళా సంఘాలకు ఎక్కడలేని గుర్తింపు, గౌరవం దక్కిందని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నదని, ఇందుకు వారికి రుణాలు అందచేస్తూ, ప్రోత్సహిస్తున్నదని, ఫ్లిక్ కార్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, మార్కెటింగ్ సదుపాయం కల్పించామని మంత్రి అన్నారు. మహిళా సంఘాలు చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఆయా ఉత్పత్తులకు మంచి ఆదరణ కల్పించాలని మంత్రి అధికారులకు చెప్పారు.
ఊరూరా మౌలిక సదుపాయాలపై దండోరాలు
గ్రామాల్లో మౌలిక సదుపాయలను కల్పించాం. నర్సరీలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, రైతు వేదికలు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. వాటిపై, అభివృద్ధిపై గ్రామాల్లో దండోరాలు వేసి, ఉత్సవాలను నిర్వహించాలని చెప్పారు.
అమర వీరులకు ఘనంగా నివాళులు
అనేక మంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఆవిర్భవించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ అమర వీరుల స్థూపాలున్న చోట.. వాటికి, లేని చొట కొత్తగా ఏర్పాటు చేసి, అమర వీరులకు ఘనంగా నివాళులర్పించాలని మంత్రి తెలిపారు.
ప్రగతి ఫలాలు ప్రజలకు తెలిసేలా… ర్యాలీలు, మానవహారాలు
అలాగే ప్రతగి ఫలాలు ప్రజలకు తెలిసేలా… గ్రామాల్లో, జిల్లాల్లో ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. విద్యార్థులు, మహిళా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలని మంత్రి చెప్పారు.
నాడు, నేడు… ప్రభుత్వ అభివృద్ధిపై డాక్యుమెంటరీలు
తెలంగాణకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధిపై డాక్యుమెంటరీలు రూపొందించాలని, నివేదికలు సిద్ధం చేయాలని, గతంలో పల్లెలు ఎట్లుండే… ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విషయాలు ప్రజలకు తెలిసేలా, ఫోటో ఎగ్జిబిషన్ లు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు తెలిపారు.
ప్రతి రోజూ మిషన్ భగీరథ మంచినీటి పరీక్షలు
ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో మిషన్ భగీరథ మంచినీటిని ప్రతి రోజూ పరీక్షించాలి. లోటుపాట్లను గుర్తించాలి. ప్రజలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన మంచినీటిని అందించాలి. అని మంత్రి తెలిపారు.
ఉత్తమ అవార్డులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ పరిధిలోని ఉత్తమ స్వయం సహాయక సంఘాలు, సంఘాల సభ్యులను, గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బందిని ఉత్తమంగా పని చేసిన వారిని ఎంపిక చేసి, వారిని సత్కరించాలి. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు
అధికారులు ఆయా శాఖల వారీగా సమన్వయంతో పని చేయాలి. అంతా కలిసికట్టుగా కార్యక్రమాలను నిర్వహించాలి. అని మంత్రి తెలిపారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా ప్రణాళికలు
వివిధ వర్గాల వారీగా, వృత్తుల వారీగా, సమాజంలోని ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, ఆయా కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ వివిధ అభివృద్ధి కమిటీలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలను భాగస్వాములను చేయాలి. ఏ రోజు ఏం చేయాలి? ఎలా చేయాలనే దానిపై మార్గదర్శకాలను సిద్ధం చేయాలి. ఆయా అంశాలను గ్రామ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులకు చేరేలా చేయండి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను దిశానిర్దేశం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ పెట్టి త్వరలోనే తగు మార్గదర్శకాలను రూపొందించిన అందరికీ వివరించాలని మంత్రి తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల అన్ని కార్యక్రమాలలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరు ప్రత్యేకంగా, స్పష్టంగా కనిపించాలి. అందకు తగ్గట్లుగా ఆయా అంశాలను రూపొందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో…స్పెషల్ కమిషనర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ల జాన్ వెస్లీ, రామారావు, రవిందర్, మిషన్ భగీరథ ఇ ఎన్ సి కృపాకర్ రెడ్డి, సెర్ప్ డైరెక్టర్లు రజిత, తదితరులు పాల్గొన్నారు.