థర్డ్ వేవ్ రావడం ఖాయం: ఐఐటీ ప్రొఫెసర్

కరోనా థర్డ్ వేవ్ కు ఒమిక్రాన్ వేరియంట్ కారణమవ్వొచ్చని నిపుణులు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరికల్లా ఒమిక్రాన్ వేరియంట్ పీక్ స్టేజ్ కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ అగర్వాల్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘సూత్ర’ అనే విధానం ఆధారంగా ఆయన ప్రస్తుత పరిస్థితులపై రీసర్చ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ… ఒమిక్రాన్ కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధకశక్తిని ఒమిక్రాన్ తగ్గించబోదని చెప్పారు.

ఎవరికైనా ఒమిక్రాన్ సోకినా క్లిష్టమైన సమస్యలు తలెత్తబోవని తెలిపారు. ఒమిక్రాన్ సోకినవారిలో కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. ఒమిక్రాన్ గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో కూడా దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ రావడం ఖాయమని ప్రొఫెసర్ తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే చర్యలపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని చెప్పారు. జనాలు గుంపులుగా చేరకుండా నిషేధం విధించడం, రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేయడం వంటి చర్యలు సరిపోతాయని చెప్పారు.
Tags: Corona Virus, Omicron, Third Wave, Prof Aggarwal

Leave A Reply

Your email address will not be published.