సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసానికి సీఎం జగన్ తల్లి విజయమ్మ
అమరావతి జూన్ 8
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. అయితే విజయమ్మ వెళ్లిన సమయంలో సజ్జల ఇంటి వద్ద లేరు. దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయారు. సజ్జల ఇంటికి విజయమ్మ రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు సజ్జల ఇంటికి విజయమ్మ ఎందుకు వచ్చారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా విజయమ్మ హైదరాబాద్‌లోని కుమార్తె వైఎస్ షర్మిల వద్దే ఉంటున్నారు.
అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాల పరిష్కారానికి సజ్జల రాయబారం నడిపారని గత కొద్ది రోజులుగా ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. అది ఫలవంతం కావడంతో మరింతమంది ముఖ్యులు వైవీ సుబ్బారెడ్డి, చెన్నైలోని కజిన్ అనిల్ తదితరులు రాయబారం చేసినట్లు తెలుస్తోంది. అన్నాచెల్లెళ్ల మధ్య వివాదాలు సమసిపోవాలని, ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆస్తుల పంపకాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తల్లి విజయమ్మ ఆకాంక్షించారు. ఈ క్రమంలో సజ్జల రాయబారం అనంతరం జగన్, షర్మిల స్తబ్దుగా ఉండిపోయారు. ఇదిలా జరుగుతుండగా సజ్జల నివాసానికి వైఎస్ విజయమ్మ రావడం పార్టీ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. రానున్న ఎన్నికల్లో షర్మిల వ్యతిరేకంగా ఉంటే.. క్రైస్తవ ఓట్లలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో అంతకు ముందే అన్నాచెల్లెళ్ల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని పార్టీ పెద్దలతో జగన్ రాయబారం నడిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ ?
ఈ నేపథ్యంలో సజ్జలను కలిసేందుకు విజయమ్మ రావడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే విజయమ్మ… సజ్జలను కలిసేందుకు వచ్చారా? లేక సజ్జల కుటుంబీకులను కలిసేందుకు వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. అన్నాచెల్లెళ్ల మధ్య సమస్యలను తొలగించేందుకు సజ్జల రాయబారం నడిపిన నేపథ్యంలో ఈ విషయంపై చర్చించేందుకు విజయమ్మ వచ్చినట్లు సమాచారం. దీనిపై పార్టీ వర్గాలు కానీ.. ప్రభుత్వ వర్గాలు కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వని పరిస్థితి.