Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

విశాఖ మెట్రో పై ప్రతిపాదనలు రాలేదన్న కేంద్రం

0

రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎటువంటి ప్రతిపాదన లేదని  కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలియజేశారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి సమాధానమిస్తూ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు. సవరించిన మెట్రో రైలు విధానం, 2017 ప్రకారం మెట్రో రైలు ప్రతిపాదనను మళ్లీ సమర్పించాలని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన పంపలేదని  హర్దీప్ పూరి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) కింద లైట్ రైల్ ప్రాజెక్ట్‌ను నిర్మించాలనుకుంటున్నట్లు తెలియజేసిందని, కొరియా (కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్) నుంచి ఆర్థిక సహాయం కోసమై భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం కొరియన్ EXIM బ్యాంక్‌కు అందించగా ఈ ప్రాజెక్ట్‌కు నిధులు అందించలేమని తెలియచేసిందన్నారు. ఈ విషయాన్ని 2019 ఏప్రిల్ లో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తెలిపింది. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదన విషయమై రుణ సహాయం కోసం ఇతర ఏజెన్సీలకు సంప్రదించవచ్చని సలహా ఇచ్చిందని కేంద్రం తెలిపింది.

అయితే, ఇప్పటి వరకు విశాఖపట్నం లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ఏ ఏజెన్సీ నుంచి ఆర్థిక సహాయం ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం సమర్పించలేదని కేంద్ర మంత్రి తెలియజేశారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి సమాధానంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ…. విశాఖకు ఎంతో అవసరమైన మెట్రో రైలు ప్రాజెక్టు రాకపోవడానికి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం,నిరాసక్తే కారణం అన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు రూపొందించి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవాలని ఎంపీ జీవీఎల్ సూచించారు.

ప్రధాని మోదీ రైల్వే రంగంలో వందే భారత్ రైలు వంటి  విప్లవాత్మకమైన అభివృద్ధి చూపిస్తున్న నేపథ్యంలో ఏపీ మెట్రో రైలు వంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ఇది విశాఖ అభివృద్ధిపై  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై గతంలో ఒకసారి సీఎం జగన్ సమీక్షించారు. మెట్రో ప్రాజెక్టుకు వనరుల సమీకరణపై అధికారులతో చర్చించారు. సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అప్పట్లో సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలన్నారు. పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలన్నారు.  విశాఖ మెట్రోపై ప్రతిపాదనలు అందాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సమర్పించలేదని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie