Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వారాహి యాత్రపైనే కోటి ఆశలు.

0

ప్రజాభిమాన్ని సంపాదించే అవకాశం అరుదుగా కోట్లల్లో ఒక్కరికే వస్తుంది. ఆ అవకాశం వారాహి యాత్ర ద్వారా పవన్‌ కల్యాణ్‌కి వచ్చింది. ఈ యాత్రలో ఆయన ప్రతి సామాజిక వర్గాన్ని, అన్ని వృత్తుల వారిని కలవాలి..’ పీపుల్స్ పల్స్ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ, అభిప్రాయం.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తా’, ‘వైఎస్సార్సీపీ విముక్త పాలనే లక్ష్యం’.. ఈ రెండు ప్రకటనలు చేసిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురించి, ఆయనలో వచ్చిన పరిపక్వత గురించి ఆలోచించేలా చేశాయి. ఆంధ్ర రాజకీయాల్లో తన పాత్ర ఏంటో పవన్‌ అర్థం చేసుకున్నారు. అందుకే, ముందు ఓట్లు, సీట్లు తేవాలని, తర్వాతే ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేన కార్యకర్తలకు కొంతకాలంగా వివరంగా చెప్తున్నారు.

 

ఈ సంవత్సరం మొత్తం పొత్తులపై తన వైఖరిని, రాబోయే కాలంలో తన రాజకీయ లక్ష్యాన్ని వివరిస్తూ కార్యకర్తలను మానసికంగా ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయమై ఇప్పుడు ఆయన ప్రజలనూ ఒప్పించేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన సిద్దాంతాలను, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తలపెట్టిన వారాహి యాత్ర ఈ నెల 14న అన్నవరంలోని సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి ప్రారంభం కాబోతుంది. యాత్ర పేరిట జనంలోకి వెళ్తున్న జనసేనానికి ఇదొక అగ్నిపరీక్ష..మొదటి విడతలో అన్నవరం నుంచి భీమవరం వరకు పదకొండు నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉంటుంది.

 

దీన్ని బట్టి చూస్తే పవన్‌ ముందుగా తనకు పట్టున్న ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విడతలవారీగా యాత్ర చేయనున్నారు. 2009లో పవన్‌ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి, 2019లో పోటీ చేసిన తన జనసేన పార్టీకి అత్యధిక ఓట్లు కూడా గుంటూరు నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న ఈ ప్రాంతంలోనే వచ్చాయి.కర్ణాటకలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న ఓల్డ్‌ మైసూర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగానే, జనసేన కూడా తన బలమేంటో గుర్తించి, తనకు పట్టున్న ప్రాంతంపైనే దృష్టి పెట్టడటం ఆ పార్టీకి శుభ పరిణామమే. కానీ ఇక్కడ ఒక చిక్కుముడి కూడా ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో కుల వైషమ్యాలు చాలా ఎక్కువ. ఈ సున్నితమైన అంశంలో జోక్యం చేసుకోవడం అంత సులభం కాదు.

 

కాబట్టి కులాల మధ్య ఐక్యత సాధించడానికి జనసేనాని పకడ్భందీ ప్రణాళికలతో ముందుకు రాకపోతే, యాత్ర లక్ష్యం దారితప్పి గమ్యం చేరడం కష్టంగా మారొచ్చు!కులాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులు, దళితుల మధ్య ఐక్యత సాధించిన మాయావతి 2007లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇదే సూత్రాన్ని జనసేన కూడా గోదావరి జిల్లాల్లో అనుసరించాలి. స్థానికంగా ఉండే అన్ని వర్గాల వారిని పవన్‌ కల్యాణ్‌ కలుపుకుంటూ వెళ్తూ ముందుకు సాగుతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ఇక్కడ కేవలం మాట్లాడితే సరిపోదు. వారి మధ్య సఖ్యత తీసుకురావడానికి భరోసా ఇవ్వాలి.

 

తమ పార్టీ అందరితో కలిసి ఉంటుందనే సామాజిక భావనను వారిలో పెంపొందించాలి. ఆయా వర్గాలకు తను ఏ విధంగా న్యాయం చేస్తారో వివరించాలి. జనసేన ఏడు సిద్దాంతాల్లో ముఖ్యమైన ‘కులాలను కలిపే ఆలోచనా విధానం’ ‘మతాల ప్రస్తావన లేని రాజకీయం’ అంశాలను జనసేన క్షేత్ర స్థాయిలో ఎలా అమలు పరచగలదనేది ఈ యాత్రతో స్పష్టమవుతుంది. కాపు సామాజిక వర్గం వారు యాత్రలో కచ్చితంగా పవన్‌ కల్యాణే సీఎం కావాలని నినాదాలిస్తారు. వారు అలా ఆశించడంలో కూడా తప్పు లేదు. కానీ ఈ సవాల్‌ని అధిగమించి వారికి నచ్చచెప్పి అన్ని వర్గాలను తన వైపు తిప్పుకోవాల్సిన బరువైన బాధ్యత జనసేనానిపై ఉంది.అధికార వైఎస్సార్సీపీని తిట్టడానికే అయితే ఈ వారాహి యాత్ర వల్ల ఏ ఉపయోగమూ ఉండదు.

ఏపీలో విద్యుత్ చార్జీల బాదుడు.

వైఎస్‌ఆర్‌సీపీ పాలన వల్ల అష్ట కష్టాలు పడుతున్న ప్రజలకు వాటిని పవన్‌ యాత్రలో మళ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రజలను ఆ కష్టాల నుండి గట్టెక్కించడానికి జనసేన దగ్గర ఎలాంటి ప్రణాళికలున్నాయి? వాటిని ఎలా అమలు చేస్తారనేదే ఈ యాత్ర లక్ష్యం కావాలి. జనసేన చెప్పుకుంటున్నట్టుగా ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం ఈ మూడు నినాదాలను ఎలా జోడిస్తారు? ఎలా ఈ మూడు లక్ష్యాలను సమతుల్యంలో నెరవేరుస్తారో పవన్‌ తన యాత్రలో ప్రజలకు వివరించాలి.ఇప్పటికే టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో జగన్‌ అందిస్తున్న నగదు బదిలీకి కొనసాగింపుగానే కనిపించింది.

 

కొంచెం కూడా కొత్తదనంలేని ఆ మేనిఫెస్టోలో రాష్ట్ర గతిని, ప్రగతిని మార్చే అద్భుతాలేమీ లేవు. ప్రజలు అభివృద్ధిని, ఉద్యోగాలను, మౌలిక సదుపాయాలను కోరుకుంటున్న తరుణంలో దాని కోసం ప్రత్యేకంగా జనసేన ఇప్పుడేం చేయగలనేది ప్రశ్న. టీడీపీతో పొత్తుపెట్టుకుని ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం’ ద్వారా యూపీఏ-1లో కమ్యూనిస్టులు పోషించిన పాత్రను జనసేన పోషించగలదని చెప్పేందుకు కూడా ఈ యాత్రను జనసేన పూర్తిగా ఉపయోగించుకోవాలి. టీడీపీ ప్రకటించిన మిని మేనిఫెస్టోని సైతం మార్చగల శక్తి సామర్థ్యాలు తమ పొత్తుకు ఉంటుందని జనసేనాని ప్రజల్లో నమ్మకం కలిగించాలి.

 

ప్రతి నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులపాటు ఉండేలా యాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. స్వయంగా ప్రజల బాధలను తెలుసుకునేందుకు, క్షేత్ర స్థాయి పరిస్థితులను స్వయంగా అంచనా వేసేందుకు ఆయనకు ఇది అందివచ్చిన సదావకాశం. గజమాలలు, జగన్‌పై తిట్ల దండకంతో సమయం వృథా చేయకుండా ఈ రెండు రోజుల్లో ఆయన 80 శాతం సమయాన్ని స్థానిక సమస్యలు, 10 శాతం రాష్ట్ర సమస్యలపై, 10 శాతం అధికార పార్టీ వైఫల్యాలపై మాట్లాడుతూ వాటికి పరిష్కారాలను సూచిస్తే మంచిది. స్థానిక సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో అక్కడే వివరించాలి.

 

దీనికోసం పవన్‌ కల్యాణ్‌ బృందం స్థానిక సమస్యలపై లోతుగా పరిశోధన చేసి సరైన పరిష్కారాలతో రోజువారి నివేదికలు అందిస్తూ ఓటర్ల మనసు గెలుచుకోగలిగితే యాత్ర లక్ష్యం నెరవేరి ‘వారాహి’ విజయవంతం అవుతుంది.యాత్రలో భాగంగా రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడతారని కూడా చెప్పారు. అయితే గతంలో నిర్వహించిన జనవాణిలో కూడా పవన్‌ వినతులు స్వీకరించారు. సమస్యలపై వచ్చిన వినతుల ఆధారంగా ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తారా? వినతులకు పరిష్కారం చూపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు?

 

భవిష్యత్తులో తమ ప్రభుత్వం వస్తే ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? వంటి విషయాల్లో కూడా ఈ యాత్ర ద్వారా ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. యాత్రలో రోజూ స్థానిక జనసైనికులు, వీర మహిళలతో పార్టీ బలోపేతం మీద దిశానిర్దేశం ఉంటుందని కూడా చెప్తున్నారు. పార్టీ నిర్మాణ లోపాల వల్ల గత పదేళ్లలో జనసేనానితో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం రాలేదు. ఈ యాత్ర ద్వారా పవన్‌ కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలి. తాను అందరి వాడినని పవన్‌ ఈ యాత్ర ద్వారా తెలియజేయాలి. 2019లో జనసేన పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు. అప్పుడు జనం లక్షలాదిగా తరలివచ్చినా, ఆ సంఖ్య ఓట్లుగా మారలేదు. కానీ, ఈసారి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకు బూత్‌ లెవల్‌ నుంచి నాయకులు ఉన్నారు.

 

పార్టీ నిర్మాణం వల్ల బలంగా మారిన నెట్వర్క్‌ని ఉపయోగించుకొని తాను పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ కాదనే గట్టి సందేశాన్ని పవన్‌ ఈసారి అందిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.విభజన హామీలు తీర్చడంలో బీజేపీ, విభజన హామీల కోసం కొట్లాడటంలో టీడీపీ, జనసేన, వైఎస్సార్పీపీ విఫలం కావడంతో ప్రజలు కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనంలోకి వస్తున్న పవన్‌, బీజేపీతో ఎందుకు జత కట్టారో కూడా చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జనసేన అధికారంలోకి వస్తే విభజన హామీల అమలుకు ఏం చేస్తారో కూడా చెప్పాలి. అదే మాటను బీజేపీతోనూ చెప్పించాలి.

 

అప్పుడే జనసేనానిపై విశ్వసనీయత పెరుగుతుంది. ఇక ప్రజల దగ్గరికి ఏ నాయకుడు వచ్చినా ఆహ్వానించాల్సిందే. ప్రజలను చదివినవాళ్లే చరిత్రలో గొప్ప నాయకులుగా పేరు సంపాదించుకున్నారు.ప్రజాభిమాన్ని సంపాదించే అవకాశం అరుదుగా కోట్లల్లో ఒక్కరికే వస్తుంది. ఆ అవకాశం వారాహి యాత్ర ద్వారా పవన్‌ కల్యాణ్‌కి వచ్చింది. ఈ యాత్రలో ఆయన ప్రతి సామాజిక వర్గాన్ని, అన్ని వృత్తుల వారిని కలవాలి. వారాహి దిగి స్థానిక ప్రజలతో మమేకమై, వారు ఎలా ఆలోచిస్తున్నారు? వారి సమస్యలు ఏంటో, వారి ఆకాంక్షలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. జనహితం కోసం జనసేన ఏం చేస్తుందో చాటి చెప్పాలి. ఈ యాత్ర జనహితార్థం జరిగితేనే ‘జనసేనాని యాత్రకు జనం వస్తారు కానీ, ఓట్లుపడవు’ అనే ముద్ర చెరిగిపోతుంది. అప్పుడే జనసేన కల నిజమవుతుంది …ఈ యాత్ర జనహిత యాత్రగా మారుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie