హైదరాబాద్, ఫిబ్రవరి 6: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఇటీవలే కేంద్రం రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది. మరి కొత్త రైళ్లను త్వరలోనే తీసుకొస్తామని ఇటీవలే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. వందేభారత్ ట్రైన్‌లకు స్లీపర్ వర్షన్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కనున్నట్టు తెలిపారు.ప్రస్తుతం ఉన్న వందేభారత్ ట్రైన్స్‌లో కేవలం చైర్‌కార్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాదాపు 500-600 కిలోమీటర్లు కవర్ చేసేస్తాయి ఈ రైళ్లు. అయితే… అంతసేపు అలా కూర్చుని ప్రయాణించే బదులు హాయిగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భావించారు.
ఇందులో భాగంగానే స్లీపర్ కోచ్‌లను జోడించాలని ప్లాన్ చేస్తోంది రైల్వే శాఖ. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ వసతి ఎంతగానే ఉపయోగపడుతుందని భావిస్తోంది. 400 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే మార్గాల్లో ఈ స్లీపర్ వందేభారత్ ట్రైన్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. తక్కువ సమయంలోనే సౌకర్యంగా గమ్య స్థానాలకు చేరుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలు చేస్తే ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులకూ సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. మొట్టమొదట ఢిల్లీ నుంచి కాన్‌పూర్, వారణాసి నుంచి ఢిల్లీ మార్గాల్లో ఈ స్లీపర్ వందే భారత్ ట్రైన్ సర్వీస్‌లు నడవనున్నాయి. రైల్వే శాఖకు చెందిన మానిటరింగ్ కమిటీ దీనిపై పూర్తిస్థాయి రిపోర్ట్ తయారు చేస్తోంది. త్వరలోనే వందే భారత్ మెట్రో సర్వీస్‌లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా వందేభారత్ మెట్రో సర్వీస్‌లు నడిపేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది మోదీ ప్రభుత్వం. కేంద్ర పద్దుని ప్రవేశపెట్టిన తరవాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వందేభారత్ మెట్రో రైళ్లు “మినీ వర్షన్” అని వెల్లడించారు. త్వరలోనే రైల్వేశాఖ వీటిని తయారు చేస్తుందని స్పష్టం చేశారు. నగరాల్లోని ప్రజలకు ఈ సర్వీస్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
అయితే.. దీనిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావన రాకపోయినా… రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాత్రం ప్రకటన చేశారు. “ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వందే మెట్రో ట్రైన్‌లు తీసుకురానున్నాం. సిటీల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుతాయి. పూర్తిగా భారత్‌లోనే వీటిని తయారు చేస్తారు. త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. హోం టౌన్స్ నుంచి సిటీలకు వచ్చే వారికి ఈ సేవలు చాలా ఊరటనిస్తాయి. ఈ ఏడాదే డిజైన్‌ను పూర్తి చేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వాటి ప్రొడక్షన్‌ను పెంచుతాం”