Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మేకపోతు గాంభీర్యంలో కమలం నేతలు

0

హైదరాబాద్, ఫిబ్రవరి 2,
బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటి కలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ ముఖ్య నేత బి.ఎల్‌.సంతోష్‌ 30 సీట్లు సరిపోవని అధికారం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునివ్వడం వారికి అందిన నివేదికల సారాంశమే. ఇండియా టుడే – సీ ఓటర్‌ తాజాగా నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో కూడా ఇదే విషయం తేటతెల్లమయ్యింది. ఈ సంస్థ ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వేలో కూడా రాష్ట్రంలో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించగా తాజాగా కూడా ఆరు స్థానాలే వస్తాయని తెలపడం ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా ఉందని చెప్పవచ్చు.

వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొనే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పార్టీ కీలక నేత బన్సల్‌ రాజకీయ పార్టీ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కాదని, మనమూ కాలానుగుణంగా రాజకీయాలు చేయాలని సుతిమెత్తంగా రాష్ట్ర నేతలను హెచ్చరించారు. ముస్లింలు పార్టీకి చేరువయ్యేలా చర్యలు చేపట్టాలని, సినిమాలు వంటి సున్నితమైన వాటికి దూరంగా ఉండాలని స్వయాన ప్రధాని మోదీ పిలుపినిచ్చినా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇవేమి మాకు పట్టవన్నట్టు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేస్తూండడంతో రాష్ట్రంలో పార్టీ అన్ని వర్గాలకు చేరువవడం లేదు.రాష్ట్రంలోని 119 అసెంబీ నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా సెగ్మంట్లలో బీజేపీకి అభ్యర్థులే లేరనే విషయం బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో అభ్యర్థుల కొరతను గుర్తించిన ఢిల్లీ నేతలు ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది.

బీజేపీ సుమారు 30 స్థానాల్లో పోటీ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా ఆ స్థానాల్లో వర్గపోరుతో నష్టం చేకూర్చుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు పార్టీలో మాత్రం కాబోయే సీఎం అంటూ అగ్రనేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు చూస్తుంటే చిన్నపిల్లల మ్యూజిక్‌ చైర్స్‌ ఆట గుర్తుకొస్తుంది. జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఢిల్లీ పెద్దల కనుసన్నుల్లోనే నాయకత్వం ఎంపిక ఉంటుంది. అన్నీ తెలిసి కూడా స్థానిక అగ్ర నాయకులు ఎవరికి వారే సొంత సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో వర్గ పోరును తారాస్థాయికి తీసుకెళ్తున్నారు. అధికారం రాకముందే రాష్ట్ర బీజేపీలో కాంగ్రెస్‌ సంస్కృతి వచ్చింది.ఉత్తర భారతదేశంలో బీజేపీ సాచ్యురేషన్‌కు చేరింది. అందుకే, ఇప్పుడు దక్షిణభారత దేశం వైపు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతేడాది జూలైలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించారు.

రాష్ట్ర బీజేపీ ‘సాలు దొర సెలవు దొర’ అంటూ కౌంట్‌ డౌన్‌ నినాదం కూడా మొదలుపెట్టింది. ఇది రెండక్షరాల మాటే కానీ తెలంగాణ చరిత్రలో ఒక ఫ్యూడల్‌ వారసత్వాన్ని, కుల ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలకు దూరంగా పాలకుడిని నిలబెట్టే వ్యూహం కూడా ఇందులో ఉంది. కానీ, ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా, ఆ స్ఫూర్తిని కొనసాగించడంలో బీజేపీ విఫలమయ్యింది.అగ్రనేతలు నరేంద్రమోదీతో, అమిత్‌ షాతో, జేపీ నడ్డాతో బహిరంగ సభలు పెడుతున్నామని షెడ్యూళ్లు ప్రకటించి హడావుడి చేయడం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి విస్తృత కార్యక్రమం, 11 వేల కార్నర్‌ సమావేశాలు, ప్రధాని పర్యటనలు అంటూ నిత్యం ప్రచారం చేస్తున్నారు. తర్వాత అవి కారణాలు లేకుండానే వాయిదాలు పడుతున్నాయి. లక్షలాది మందితో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ చెబుతున్నా వారి లెక్కలకు వాస్తవికత లెక్కలు సరితూగడం లేదు.మోదీ వచ్చినా, అమిత్‌ షా వచ్చినా ఇంకోవరో దిగినా…

కేసీఆర్‌ కుటుంబ పాలన గురించి మాట్టాడడం తప్పా తెలంగాణకు వారు ఏం చేద్దామనుకుంటున్నారో ఎప్పుడూ చెప్పడం లేదు. బీఆర్‌ఎస్‌లో మంత్రులు మొదలుకొని కార్యకర్తల వరకు పత్రికల్లో, సోషల్‌ మీడియాలో కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందని లెక్కలతో సహా విమర్శలు చేస్తున్నా అదే స్థాయిలో ఆ సవాళ్లను తిప్పికొట్టడంలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతోంది.ఎవరు ఖర్చు చేసినా అది ప్రజా సొమ్మే. ఏయే రంగంలో ఎంత ఖర్చు చేశారు..? భవిష్యత్తులో వేటికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు..? ప్రత్యేకంగా తెలంగాణ కోసం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది వంటి సందేహాలను నివృత్తి చేయలేపోతున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏంటో రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి చెప్పకుండా… ఇక్కడ పవర్‌లోకి వచ్చేస్తున్నామని పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్స్‌ ఇచ్చేస్తున్నట్టున్నారు! రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఢిల్లీ పెద్దలు పార్టీ జాతీయ స్థాయిలో, కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్ర నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నా వారు ఆశించిన మేరకు కృషి చేయకుండా ఎవరికి వారు తమకు అనుకూలంగా మీడియాలో లీకులిచ్చుకుంటున్నారు. బీజేపీలో చేరిన రాజగోపాల్‌ రెడ్డి తన గెలుపును పార్టీకి గిఫ్ట్‌ గా ఇస్తానని ప్రకటించారు. కానీ, బీజేపీ నాయకులు కలిసి కట్టుగా పనిచేయకపోవడం, అతి విశ్వాసం వల్ల ఓటమిని మూటగట్టుకున్నారు.

తెలంగాణలో మొదటి నుండి సంస్థాగతంగా బలంగా లేని బీజేపీ పశ్చిమబెంగాల్‌, అస్సాం, త్రిపుల రాష్ట్రాల్లో చేసిన ప్రయోగాలను ఇక్కడ కూడా చేయాలని చూస్తున్నా ఇక్కడ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేక సంస్కృతి కలిగిన తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడవద్దని అర్థం చేసుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఫెయిల్‌ అయిన వ్యూహాల్నే ఆ పార్టీ మళ్లీ మళ్లీ అమలు చేస్తుండటం హాస్యాస్పదం!2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గోషామహల్‌లో రాజాసింగ్‌ ఒక్కరే గెలిచారు. 103 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవడంతో ఆ పార్టీకి రాష్ట్రంపై ఆశలు కలిగాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెడితే అధికారంలోకి రావచ్చనే విశ్వాసం పార్టీ జాతీయ నాయకులకు కలిగింది. తదనుగుణంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఊహించని విధంగా స్థానాలు సాధించడంతో పాటు దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీలో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అయితే రెండు ఉప ఎన్నికల విజయంలో అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం కూడా ఉండడం, అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ వర్గపోరుతో బలహీనపడిన విషయాన్ని మరిచిన బీజేపీ ఆ విజయాలను పార్టీ ఖాతాలో వేసుకొని రాష్ట్రంలో పార్టీ బలపడిందనే భావనలో ఉండి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడాన్ని అటకెక్కించారు.

ఇక్కడే బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుంది. వరుసగా రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది.ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఫలానా అభ్యర్థి గ్యారెంటీగా గెలుస్తాడని బల్లగుద్ది నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్డ్వ్‌ స్థానాలు 31 ఉండగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ రెండు కమిటీలను వేసింది. అయితే ఆచరణలో మాత్రం ఆ కమిటీలు ఇప్పటివరకు సమావేశాలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోలేదు. రిజర్డ్వ్‌ స్థానాలలో పట్టుసాధించని పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie