నేటి బాలలే రేపటి పౌరులని, అటువంటి బాలలను కార్మికులుగా వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా స్థానిక ఎన్.జి.ఓ హోమ్ వద్ద ర్యాలీ కార్యక్రమం కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఏడు రోడ్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నేడు నిర్వహించుకుంటున్నామని, ఈ ర్యాలీ ఒక అవగాహన కార్యక్రమమని పేర్కొన్నారు.
కుటుంబ ఆర్ధిక పరిస్థితులు దృష్ట్యా బాల కార్మికులు తయారవుతున్నారని, అటువంటి బాలలను గుర్తించి పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, మధ్యలో బడి మానివేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేటి నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయని, బడి మానివేసిన పిల్లలు కూడా హాజరయ్యేలా చూస్తున్నట్లు చెప్పారు.
దసరా, సంక్రాంతి పండుగల సెలవుల సమయాల్లో కూడా కొంతమంది పిల్లలు బడి మానివేస్తుంటారని, అటువంటి వారిపై కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరచి తిరిగి బడిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. బాలలు ఎట్టి పరిస్థితుల్లో చదువుమాని బయట ఉండకుండా, వారికి ఉజ్వల భవిష్యత్తు అందించే భాద్యత మనందరిపై ఉందని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచ బాల కార్మిక దినోత్సవం నిర్వహించుకోవడం చాలా చాలా ముఖ్యమని వివరించారు. చట్టానికి వ్యతిరేకంగా బాలలని పనిలో చేర్పించుకున్నవారు
పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన.
న్యాయపరంగా శిక్షకు అర్హులని, కావున షాపులు, చిన్నతరహా పరిశ్రమలు, వివిధ సంస్థల యజమానులు బాల కార్మికులతో పనులు చేయించుకోరాదని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, ఉప కార్మిక కమీషనర్ ఎస్.డి.వి.ప్రసాద రావు, సహాయ కార్మిక కమీషనర్ అజయ్ కార్తికేయ, సహాయ కార్మిక అధికారులు వై.శైలేష్ కుమార్, ఆర్.వి.వి. శ్రీనివాస రావు, వివిధ ప్రభుత్వ శాఖలు అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.