తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న నల్లమల అడవులు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అటవీ విస్తీర్ణంలో కలవి. ఈ అడవులు తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, గుంటూరు, కడప, మహాబుబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. దట్టమైన నల్లమల అడవిలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం సహా అనేక ప్రసిద్ధి ఆలయాలున్నాయి. అంతేకాదు దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల అభయారణ్యం ఉంది. ఇది దేశంలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రంలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ అడవులలో చిరుతపులిని తరచుగా చూడవచ్చు. ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశం నల్లమల అడవిలోని అందాలను వీక్షించడానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు.
అయితే నల్లమల అటవీలోకి యాత్రికులను నిలిపివేస్తూ ఢిల్లీకి చెందిన పులుల సంరక్షణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. 30 సెప్టెంబరు 2023 వరకు నల్లమల అటవీ ప్రదేశాలలోని పర్యాటక ప్రదేశాలన్నింటిలోకి ఎంట్రీని నిలిపివేస్తూ జాతీయ పెద్ద పులుల సంరక్షణ సంస్థ (NTCA) ఆదేశాలు జారీ చేసింది. పులులు, వన్య ప్రాణుల కలయిక కాలం ( గర్భందాల్చే కాలం) కనుక నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయరణ్యలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటిలో మానవ సంచారాన్ని మూడు నెలల పాటు నిషేధం విధించింది.
అంతేకాదు శ్రీశైలం క్షేత్రానికి వెళ్లిన వారు సమీపంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం, నెక్కంటి జంగిల్ రైడ్ ను నిలిపివేశారు.అధికారులు విధించిన నిబంధనలు అతిక్రమించి ఎవరైనా అడవిలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972, అటవీచట్టం-1967, జీవ వైవిధ్య చట్టం -2002 ప్రకారం చర్యలు తీసుకుంటామని మార్కాపురం ఫారెస్ట్ డిప్యూటి డైరెక్టర్ విజ్ఞేష్ అప్పావ్ హెచ్చరికలు జారీ చేశారు.