Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీ కాంగ్రెస్ లో ఫైర్.

0

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో దూకుడు రోజురోజుకు పెరుగుతోంది. మాటల్లో పదును కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. అధికార బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటూ పూర్తి విశ్వాసంతో ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆ విశ్వాసం ప్రజల్లో పెల్లుబికుతున్న అభిమానం వల్ల వచ్చిందా లేక కర్ణాటక ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయన్న ఒక అభిప్రాయాన్ని అందరిలో కల్పించడం ద్వారా పార్టీ బలగాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా వచ్చిందా అన్నది కాస్త తరచి చూడాల్సి ఉంది.

 

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చేతికిలబడిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో పార్టీ పొజిషన్ రెండా? మూడా? అన్న సందిగ్ధావస్థలోనే గడిపారు. అటువంటి పరిస్థితిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఘన విజయం సాధించడం ఒక్కసారిగా పరిస్థితిని తారుమారు చేసింది. కర్ణాటక ఫలితాలు వచ్చేవరకు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేది భారతీయ జనతా పార్టీనేనని చాలామంది భావిస్తూ వచ్చారు. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పరిస్థితిని బిజెపి నేతలు బాగానే మేనేజ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలలో తాము కనీసం 80 సీట్లను గెలుచుకుంటామని జిల్లాల వారిగా లెక్కలేసారు కమలనాథులు.

ఏపీలో ఏం జరుగుతోంది.. అర్ధం కాని రహస్య భేటీ..

ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి ఇప్పుడు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చురుకుగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ బిజెపిలో ఇప్పుడు కాస్త స్తబ్దత నెలకొంది. ఈ స్తబ్దతను బద్దలు కొట్టడానికి ఖమ్మం జిల్లా కేంద్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారధ్యంలో భారీ ర్యాలీకి తెలంగాణ నాయకత్వం ప్రణాళిక రచించింది. ఈ భారీ సభ ద్వారా రాష్ట్రంలో తమ ఉనికి మరోసారి గట్టిగా చాటే ప్రయత్నం చేసింది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకుంది. కానీ తెలంగాణ బిజెపి నేతలకు అశనిపాతంలా బిపోర్‌జాయ్ తుఫాన్ ఎదురయింది. పెను తుఫాను తాకిడికి తమ సొంత రాష్ట్రం గుజరాత్ తల్లడిల్లి పోతుంటే తాము ఇతర రాష్ట్రాలలో రాజకీయం చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు.

 

ఆయన ఎప్పుడు వచ్చేది ఇప్పుడప్పుడే తేలే పరిస్థితి లేదు. అయితే వెంటనే కోలుకున్న కమలనాథలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనపై దృష్టి సారించారు. జూన్ 25వ తేదీన నడ్డా సభకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆయన నాగర్ కర్నూలు సభకు హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ద్విగుణీకృతమవుతున్న కొత్త ఉత్సాహం పార్టీలో పలువురి చేరికకు కారణమవుతోంది. నిర్మల్, సిరిసిల్ల వంటి జిల్లాలలో పలువురు కీలక నాయకులు ఇతర పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్నవారు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడడం చర్చనీయాంశం అవుతుంది.

 

ఈ చేరికలు ఇలా కొనసాగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకవైపు బిజెపపైనా, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీపైనా విరుచుకుపడుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తూ.. సమయం దొరికినప్పుడల్లా అధికార పార్టీ వైఫల్యాలను ఎండ కడుతున్నారు. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు పదేపదే చెబుతున్నారు. ధరణి పోర్టల్ కారణంగా అధికార పార్టీ నాయకులు మాత్రమే లాభపడ్డారని జెన్యూన్‌గా భూములను కలిగి ఉన్న చాలా మంది ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సభలు, సమావేశాలే కాకుండా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలోనూ చెలరేగిపోతున్నారు.

ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు ఆయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గింపు.

తాజాగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం సంధించారు. ఈ ధోరణిని కొనసాగిస్తూనే పార్టీ ఒకింత వీక్‌గా కనిపిస్తున్న నియోజకవర్గాలలో ఇతర పార్టీ నాయకులకు గాలమేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశారు ఇటీవల నిర్మల్ జిల్లాలో కీలకమైన నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటిని వీడి బిజెపిలో చేరిన నేపథ్యంలో అక్కడ ఎంతో కొంత బలమైన నేతగా పేరున్న బీఆర్ఎస్ నాయకుడు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు అని భావించే శ్రీహరి రావును కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకున్నారు రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్, రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్‌లో అవకతవకలు, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఫీజు వసూలు లీజు తదితర అంశాలను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రస్తావిస్తున్నారుఒకవైపు ప్రభుత్వం మీద ఆరోపణలు.. ఇంకొక వైపు చేరికలే కాకుండా తెలంగాణ ప్రజలకు ఒక నిర్దిష్టమైన సంకేతాలను ఇవ్వడానికి పార్టీ అగ్ర నేతలను తెలంగాణకు రప్పించే ప్రయత్నాలను సైతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు.

 

సీఎల్పీ నాయకుడు పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో దాని ముగింపు సభకు ప్రియాంక గాంధీనిగాని, రాహుల్ గాంధీనిగాని పిలిచే సన్నాహాల్లో ఉన్నారు. అన్ని కుదిరితే జూన్ 21 లేదా 23వ తేదీలలో అగ్ర నేతల్లో ఒకరు ఖమ్మం వేదికగా జరిగే సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక తమ విజయ ప్రస్తానాన్ని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అక్కడ బలమైన నేతగా పేరు ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు. ఆయన కూడా కాంగ్రస్ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారన్న ఇండికేషన్స్ వచ్చాయి.  కానీ జూన్ 14వ తేదీన పొంగులేటి తాను ఏ పార్టీలో చేరబోతున్నది చెప్పేస్తానని గతంలో చెప్పినప్పటికీ ఆయన ఎందుకో వెనుకంజవేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

 

తెలంగాణలో జూన్ 14న ఆదాయపు పన్ను శాఖాధికారుల తనిఖీలు కలకలం రేపాయి. ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్ళు, ఆఫీసులే లక్ష్యంగా ఐటి సోదాలు కొనసాగాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిల వ్యాపార లావాదేవీలను, ఆదాయ వ్యయాలను, ఐటి రిటర్న్స్‌ని పరిశీలించారు ఐటి అధికారులు. ఇదంతా ఐటి సిబ్బంది రొటీన్ వర్క్‌లో భాగమే అయినా వీటి వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రమేయం వుందన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే క్రమంలో కాంట్రాక్టర్‌గా పేరున్న మాజీ ఎంపీ పొంగులేటిపైనా బీజేపీ నేతలు నజర్ పెట్టారన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.  మొత్తం మీద తెలంగాణలో నెంబర్ టు తామేనని నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నాయకులు యమా ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్న ఈ ధీమాను కరిగించే దిశగా బీఆర్ఎస్, బిజెపి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie