గత కొన్ని రోజులుగా మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. ఇటీవల కర్ణాటక మార్కెట్ లో వంద రూపాయలు దాటిన కేజీ టమాటా ధర తాజాగా ఏపీలో మంట పెడుతోంది. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో కేజీ టమాటా రికార్డు స్థాయిలో రూ.124కు చేరింది. పది రోజుల నుంచి టమాటా ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.గత వారం దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ.15 నుంచి రూ.30 మధ్య ఉండేది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పంటల దిగుబడి పెరగలేదు. మరోవైపు జూన్ మూడో వారం వరకు ఎండలు ఉండటంతో ఉత్పత్తి తగ్గింది.
ఈ క్రమంలో నాలుగైదు రోజుల కిందట హోల్‌సేల్ APMC మార్కెట్‌లో 15 కిలోల టమాటా రూ. 1,100 ధర పలికింది. హోల్ సేల్ ధర ఇంతలా ఉందంటే.. కేజీ చిల్లర ధర రూ.80కి చేరుకుంది. రిటైల్ మార్కెట్‌లో కొన్ని చోట్ల నాణ్యత లేని టమాటాను సైతం ఇదే ధరలకు విక్రయిస్తున్నారు. ఈ బిజినెస్ కు సంబంధం ఉన్న ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. త్వరలోనే 1 కేజీ టమాటా ధర రూ.100 మార్కు దాటుతుందని అంచనా వేశారుమదనపల్లె వ్యవసాయ మార్కెట్ కు దాదాపు 1500 టన్నుల వరకు టమాటా వచ్చేది. నేడు మార్కెట్ కు ఇందులో సగం మాత్రమే రావడంతో.. ఒక్కసారిగా ధరలు పెరిగాయి.
ఏ గ్రేడ్ రకం టమాటా కిలో రూ.106 నుంచి రూ.124 వరకు ధర పలికింది. బీ గ్రేడ్ రూ.86 నుంచి రూ.105 మధ్య ఉండగా.. ఓవరాల్ గా చూస్తే కేజీ రూ.100 మీద టమాటా ధర పలికిందని స్థానిక మార్కెట్ కు చెందిన వారు తెలిపారు. కర్ణాకక మార్కెట్ తో పాటు మదనపల్లె మార్కెట్ నుంచి ఉత్తరాధి రాష్ట్రాలకు టమాటా భారీ ఎత్తున సరఫరా అవుతుందని తెలిసిందే.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలోని మార్కెట్ లో కిలో టమోటా కనిష్ట ధరలు నమోదు చేసింది. ప్రస్తుతం కేజీ రూ.120 పైగా నమోదు చేస్తున్న టమాటా, గత ఏడాది జులై నెలలో ఓ దశలో కిలో రూ. 5కి పడిపోయింది.
కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన చెందారు. మరికొందరు రైతులు రవాణా ఖర్చులు కూడా రావు అని, రోడ్లపై టమాటాలు కుప్పలుకుప్పలుగా పడేశారు. ఓవైపు మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్ కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా రూ.5కు పడిపోయింది.