Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కామ్రేడ్స్‌తో పొత్తుకు బీఆర్‌ఎస్‌ లెఫ్టా-రైటా..

0

మునుగోడు బై ఎలక్షన్‌లో ఆ స్నేహం చూసి అసెంబ్లీ ఎన్నికలనాటికి ఫ్రెండ్‌షిప్‌ స్ట్రాంగ్‌ అవుతుందనుకున్నారు. ఖమ్మం, నల్గొండ సహా కొన్ని జిల్లాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే వామపక్షాలతో బీఆర్‌ఎస్‌కి పొత్తు కుదరడం ఖాయమనే అనుకున్నారు. పొత్తులుంటాయని ఆ పార్టీల ముఖ్యనేతలు చెప్పకపోయినా. .కాదనైతే ఇప్పటిదాకా ఖండించలేదు. కానీ ఎన్నికలకు ఆర్నెల్ల సమయమే ఉన్నా… పొత్తుల దిశగా అడుగులు మాత్రం పడలేదు. అదే సమయంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ ఇతర విపక్షపార్టీలతో కలిసి కదిలేందుకు కామ్రేడ్లు సిద్ధమవుతున్నారు.

 

దీంతో దాని ఎఫెక్ట్‌ తెలంగాణపైనా పడటం ఖాయంలా కనిపిస్తోంది. పాట్నా సమావేశం తర్వాత విపక్షపార్టీల ఐక్యతపై క్లారిటీ వస్తోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ సహా మిగిలిన ప్రధాన విపక్షపార్టీలు ఒకేతాటిపైకొస్తున్నాయి. వామపక్షపార్టీల జాతీయ నేతలు ఈ మీటింగ్‌కి హాజరై తమ స్టాండ్‌ ఏమిటో చెప్పేశారు. జాతీయపార్టీగా బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌.. పాట్నా మీటింగ్‌కి దూరంగా ఉంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌.. బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. దీంతో తెలంగాణలో కేసీఆర్‌ పార్టీతో పొత్తుల విషయంలో వామపక్షపార్టీలు పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది.

 

కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం కూడా లెఫ్ట్‌ పార్టీలపై ప్రభావం చూపిందంటున్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి మద్దతుగా నిలిచాయి సీపీఐ, సీపీఎం. అధికారపార్టీ తరపున ప్రచారం కూడా చేశాయి. బైపోల్‌లో గులాబీపార్టీ గెలుపుతో వామపక్షాలతో ఆ పార్టీ బంధం అసెంబ్లీ ఎన్నికలనాటికి మరింత బలపడుతుందని అనుకున్నారు. అయితే కిందిస్థాయి నాయకుల్లో చర్చలే తప్ప ముఖ్య నేతల మధ్య మంతనాలు లేకపోవటంతో పొత్తులుంటాయా లేదా అన్నది ఇప్పటిదాకా ఊహాజనితంగానే ఉంది. పాట్నా సమావేశం తర్వాత అన్ని లెక్కలూ వేసుకున్న వామపక్షపార్టీలు బీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలో అంత ఆసక్తిగా లేవన్న చర్చ మొదలైంది.

 

బీజేపీని నిలువరించే విషయంలో బీఆర్‌ఎస్‌ చొరవ సరిపోదన్న అభిప్రాయంతో ఉన్నారు వామపక్షపార్టీల నేతలు. బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్‌ పార్టీతోనైనా జట్టు కట్టడానికి సిద్ధమంటున్నారు సీపీఐ ముఖ్యనేతలు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో పోటీపడే ప్రధాన పక్షం కాంగ్రెసేనని ఆ పార్టీ కీలకనేత నారాయణ స్పష్టంచేయటంతో.. ఆ పార్టీకి పొత్తుల ఆప్షనేంటో అందరికీ అర్ధమైపోతోంది.జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో కలిసినడుస్తూ ఆ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్‌ఎస్‌తో పొత్తు కొంత ఇబ్బందికరమేననుకుంటున్నాయ్‌ వామపక్షాలు. అయితే తమవైపునుంచి పొత్తులుండవన్న ప్రకటన చేయకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉన్నాయి లెఫ్ట్‌ పార్టీలు.

 

హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ని లక్షమెజారిటీతో గెలిపించాలని కేటీఆర్‌ పిలుపునిస్తే.. అక్కడ ఆయన్ని ఓడించడమే తమ టార్గెట్టని సీపీఐ ప్రకటించింది. హుస్నాబాద్‌ నుంచి పోటీకి సిద్ధమయ్యారు సీపీఐ రాష్ట్ర నేత చాడ వెంకటరెడ్డి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీచేయాలనుకుంటున్న పాలేరులో కూడా సేమ్‌ సీన్‌. వామపక్షపార్టీల ఉనికిఎక్కడిదన్నట్లు అక్కడి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కందాల మాట్లాడారు. దీనికి గట్టి కౌంటరే ఇచ్చారు సీపీఎం నేతలు.బీఆర్‌ఎస్‌తో పొత్తుండదని తెగేసి చెప్పడంలేదు లెఫ్ట్‌పార్టీలు. కేసీఆర్‌ పార్టీ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని వేచిచూస్తున్నాయి.

 

పొత్తులున్నా లేకపోయినా ఎక్కడెక్కడ పోటీచేయాలన్నదానిపై సీపీఐ, సీపీఎం ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవేళ బీఆర్‌ఎస్‌తో పొత్తులపై చర్చలు జరిగితే సీట్ల విషయంలో రాజీపడొద్దన్న పట్టుదలతో ఉన్నారు కామ్రేడ్లు. అదే సమయంలో తమ స్టాండ్‌ ఏంటో కూడా స్పష్టంచేయాలనుకుంటున్నారు. అందుకే బాల్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కోర్టులోనే ఉందన్న మాట కమ్యూనిస్టు నేతల నోటినుంచి వస్తోంది. రెండుసార్లు అధికారంలోకొచ్చిన బీఆర్‌ఎస్‌కంటే కర్నాటక విజయంతో స్పీడ్‌పెంచిన కాంగ్రెస్‌తోనే కలిసి కదిలే ఆలోచనతో ఉన్నాయట వామపక్ష పార్టీలు.

 

అదే సమయంలో తాము అడిగినన్ని సీట్లిస్తే కొన్ని షరతులకు లోబడి పొత్తులకు అంగీకరించే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. సీపీఐ నేత కూనంనేని వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆయన చెబుతున్నదాని ప్రకారం బాల్‌ BRS కోర్టులోనే ఉంది. మరి కామ్రేడ్లతో పొత్తుకు గులాబీపార్టీ ముందుకొస్తుందా.. మీ దారి మీరు చూసుకోమంటుందా? ఖమ్మంలాంటి కీలక జిల్లాలో ప్రభావం చూపగల పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. బీఆర్‌ఎస్‌-వామపక్షాల పొత్తు ప్రయత్నాలు ఏ మలుపు తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie