Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అసెంబ్లీలో వర్షకాలం ఫైట్

0

హైదరాబాద్, ఆగస్టు 1:అసెంబ్లీలో ప్రతిపక్షాలపై ఎదురుదాడికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా పార్టీలను ఇరుకునపెట్టే అంశాలపై కసరత్తును ప్రారంభించారు. మరోవైపు వరద నష్ట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని కేంద్రంపై విమర్శలు సంధించనున్నారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చర్చించే అవకాశం ఉంది.ఈ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో గత 9 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రభుత్వ విజయాలను అసెంబ్లీ వేదికగా వివరించనున్నారు. విపక్షాలు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను, అందుకు కౌంటర్ ఇచ్చేందుకు సంబంధించిన వివరాల సేకరణలో మంత్రులు నిమగ్నమయ్యారు.అసెంబ్లీ సమావేశాలను అసెంబ్లీ ఎన్నికలకు వేదికగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించాలని భావిస్తున్నారు. ఆత్మరక్షణ కాకుండా ప్రతిపక్షాలపై ఇరుకునపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా గత పాలన వైఫల్యాలు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను సభలో ఎండగట్టనున్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే గత పరిస్థితులే ఎదురవుతాయని ప్రజలకు వివరించనున్నారు.అదే విధంగా కేంద్రం విభజన అంశాలపై నిర్లక్ష్యం, ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చకపోవడం అంశాలను ప్రస్తావించి బీజేపీపై దాడి చేసే అవకాశం ఉంది. గతేడాది రాష్ట్రంలో కురిసిన వరద నష్టంపై కేంద్రం అంచనా వేసినా నిధులు కేటాయించలేదని, అదే విధంగా హైదరాబాద్‌లో జరిగిన నష్టానికి నిధులు కేటాయించలేదని, బీజేపీ నేతలు సైతం బండిపోతే బండి.. అని ప్రకటన చేసి చేతులు దులుపుకోవడం తదితర అంశాలపై కార్నర్ చేయాలని చూస్తున్నారు.కేంద్రం తెలంగాణపై 9 ఏళ్లుగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని, తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో చెల్లిస్తున్నా దాంట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేయడం లేదని లెక్కలతో వివరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

అదే విధంగా బీజేపీ మతత్వాన్ని పెంచిపోషిస్తుందని ఎదురుదాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవసాయరంగానికి ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలపై స్వల్పకాలిక చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.మరోవైపు 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, దళితబంధు, బీసీలకు లక్షసాయం, మైనార్టీలకు లక్ష, హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, ఆర్టీసీ విలీనం, వరంగల్, ఖమ్మం అభివృద్ధి, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, విద్యార్థులకు డైట్ చార్జీలు పెంపు తదితర అంశాలను వివరించనున్నారు. ప్రతి పథకాన్ని సుదీర్ఘంగా చర్చించడంతో పాటు ఎంతమంది లబ్ధి పొందారనే అంశాన్ని క్లుప్తంగా వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie