హైదరాబాద్, ఫిబ్రవరి 14:దేశంలో అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల అద్దెలు పెరిగాయి. గత మూడేళ్లలో, మన దేశంలోని 7 పెద్ద నగరాల్లో, 2 పడక గదుల ఫ్లాట్ అద్దెలు విపరీతంగా పెరిగాయి. 1,000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న 2 BHK ఫ్లాట్ల అద్దెల్లో ఈ పెరుగుదల కనిపించింది.స్థిరాస్తి సలహా సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం… గత మూడేళ్లలో, అంటే 2019 – 2022 మధ్య దేశంలోని టాప్-7 నగరాల్లోని ఫ్లాట్ల అద్దెలు సగటున 23 శాతం పెరిగాయి. నానాటికీ పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇంటి అద్దెలు పెరుగుతూనే ఉన్నాయని, 2002లో ఎక్కువగా పెరిగాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పురి చెప్పారు.అనరాక్ డేటా ప్రకారం… దిల్లీ నుంచి నోయిడా వరకు అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల అద్దెల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. నోయిడాలోని సెక్టార్-150లో, 2019లో, 1000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఫ్లాట్ నెలవారీ సగటు అద్దె రూ. 15,500 ఉంటే, 2022లో అది రూ. 19,000 కి పెరిగింది. 2 BHK ఫ్లాట్లలో ఈ పెరుగుదల నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఫ్లాట్ల రెంట్‌లో 7 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ఇక్కడ, 2 పడక గదుల అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెలవారీ అద్దె 2019లోని రూ. 23,000 నుంచి 2022లో రూ. 24,600 కి పెరిగింది. గచ్చిబౌలిలో అద్దెలు రూ. 22,000 నుంచి రూ. 23,400 కు పెరిగాయి, గత మూడేళ్లలో ఈ ప్రాంతంలోని అద్దెల్లో 6 శాతం పెరుగుదల ఉంది. ఇవన్నీ ‘సగటు అద్దె’ లెక్కలని పాఠకులు గమనించాలిగురుగావ్ ప్రాంతంలో, గత మూడేళ్లలో, 2 BHK ఫ్లాట్ సగటు అద్దె రూ. 25,000 నుంచి ఇప్పుడు రూ. 28,500 కి పెరిగింది. ఈ ప్రాంతంలో అద్దె సగటున 14 శాతం పెరిగింది. ఇది కాకుండా, దిల్లీలోని ద్వారకలో ఫ్లాట్ రెంట్ యావరేజ్‌గా 13 శాతం పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 13 శాతం, కోల్‌కతాలో 16 శాతం మేర సగటు అద్దెలు పెరిగాయి.
ఐటీ హబ్ బెంగళూరులో ఫ్లాట్ రెంట్లలో సగటున 14 శాతం వరకు పెరుగుదల నమోదైంది. పుణెలో 20 శాతం, చెన్నైలో 13 శాతం పెరుగుదల నమోదైంది.దేశంలోని పెద్ద నగరాల్లో ఇళ్ల అద్దెలు ఇలా నిరంతరం ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్నకు అనూజ్ పురి సమాధానం చెప్పారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత, చాలా పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులు ఆఫీసులకు పిలుస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నిన్న, మొన్నటి వరకు హైబ్రీడ్ మోడల్‌లో పని చేయించిన సంస్థలు ఇప్పుడు పూర్తిగా ‘ఆఫీస్ నుంచి పని’ విధానానికి మారుతున్నాయి. దీంతో, ఉద్యోగుల నుంచి ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇళ్ల అద్దెలో విపరీతమైన పెరుగుదల నమోదవుతోంది. ఈ బూమ్ 2023లో కూడా కొనసాగుతుందని అనూజ్ పురి తెలిపారు.