అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని, ఆరు మాసాల్లో ఇరవై లక్షల మందికి రూ.3986 కోట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఇంతవరకు స్పందన లేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రశ్నించారు. కేవలం రూ.906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాడు మూడు లక్షలు ఇస్తానంటే.. జగన్ పది లక్షలు పూలల్లో పెట్టి ఇస్తానన్నారని, మరి జగన్కు నేటి వరకు పూలు దొరకలేదా..డబ్బులు రాలేదా చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు బాధితులను ఆదుకునే ఉద్దేశం జగన్కు ఉందా అనే అనుమానం కలుగుతోందని దుయ్యబట్టారు . అగ్రిగోల్డ్ ఆస్తులు నలభై వేల కోట్లు ఉన్నాయని చైర్మన్ తమ్ముడు చెబుతున్నారని.. మరి ఇంత ఆస్తులు ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధితులకు డబ్బులు చెల్లించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీల వర్షం కురిపించి..
ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ స్పందించి మృతుల కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆగష్టు 15 నాటికి బాధితులను ఆదుకోకపోతే ఆగష్టు 30న విజయవాడను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆంధ్ర పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి..
అనంతరం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇంతకాలం ఎదురు చూశాం.. ఇక మా ఓర్పు, సహనం నశించాయని, ఈలోపు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞాపన పత్రాలు అందిస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేసి కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు. 40 లక్షల ఓటర్లకు సంబందించి విషయంలో ఎందుకు న్యాయం చేయడం లేదో జగన్ చెప్పాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.