ఈటలదే హుజూరాబాద్ పీఠం…. 24,068 ఓట్ల తేడాతో ఘనవిజయం

  • హుజూరాబాద్ లో ముగిసిన ఓట్ల లెక్కింపు
  • మొత్తం 22 రౌండ్ల పాటు లెక్కింపు
  • రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో ఈటల ఆధిక్యం
  • వరుసగా ఏడోసారి నెగ్గిన ఈటల

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజేతగా నిలిచారు. గత కొన్ని మాసాలుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల కైవసం చేసుకున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 24,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి కిందటే ముగిసింది. మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిగింది. రెండు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ ఈటల ఆధిక్యం స్పష్టమైంది.

కాగా, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఈటలకు ఇది వరుసగా ఏడో విజయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల… భూ అక్రమాల ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయారు. ఆపై టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో ఈటల సెంటిమెంట్ ముందు టీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు పనిచేయలేదు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆయన తన స్వగ్రామంలోనూ, అత్తగారి ఊర్లోనూ ఆధిక్యం పొందలేకపోయారు. సొంతూరు హిమ్మత్ నగర్ లో గెల్లుకు 358 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఈటల రాజేందర్ కు 549 ఓట్లు వచ్చాయి. అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెలోనూ ఇదే పరిస్థితి! ఇక్కడ గెల్లు కంటే ఈటలకు 76 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
Tags: Etelarajendra, Huzurabad By Election, BJP, TRS

Leave A Reply

Your email address will not be published.