‘ఖైదీ’ చిత్రం నుంచి శివశంకర్ మాస్టర్ తో నా స్నేహం మొదలైంది; చిరంజీవి

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఖైదీ’ సినిమా నుంచి ఆయనతో స్నేహం మొదలైందని, ఆ తర్వాత ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామని వెల్లడించారు. శివశంకర్ మాస్టర్ మరణం నృత్య రంగానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి పేర్కొన్నారు. చివరిసారి తామిద్దరం కలుసుకున్నది ‘ఆచార్య’ సెట్స్ పైన అని వెల్లడించారు. ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

ఇక సోనూ సూద్ స్పందిస్తూ, శివశంకర్ మాస్టర్ ను కాపాడుకునేందుకు శక్తిమేర కృషి చేశామని, కానీ దేవుడు మరోలా నిర్ణయించాడని వ్యాఖ్యానించారు. ఆయన మరణవార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే… శివశంకర్ మాస్టర్ కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ మరణించారు. చనిపోవడానికి ముందు ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. హైదరాబాదులోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Tags: Chiranjeevi, Shivshankar Master demise

Leave A Reply

Your email address will not be published.