మయన్మార్ లో సైనిక తిరుగుబాటు… ఏడాది పాటు ఎమర్జెన్సీ!

ఇండియాకు పొరుగునే ఉన్న మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. ప్రజా నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి అంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను ఈ తెల్లవారుజామున సైనికులు అరెస్ట్ చేశారు. దేశంలో ఇటీవల ఎన్నికలు జరుగగా, ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని సైన్యాధికారులు ఆరోపిస్తూ, నేతలను అరెస్ట్ చేయడంతో పాటు ఏడాది పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.

సూకీ సహా పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించారని ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి మో నూన్ట్ ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు తెలిపారు. “నేను ప్రజలకు ఒక్క మాట చెప్పదలిచాను. ఎవరూ హింసాత్మక చర్యలకు దిగకండి. చట్టాన్ని గౌరవించండి. నన్ను కూడా అరెస్ట్ చేస్తారు” అని అన్నారు.

ఇక ఈ ఉదయం నుంచి మయన్మార్ రాజధాని న్యాపిటావ్ కు ఫోన్ కనెక్షన్లు మొత్తం కట్ అయ్యాయి. మో న్యూన్ట్ ఫోన్ సైతం ఫోన్ కు అందుబాటులో లేకుండా పోయారు. నవంబర్ లో దేశంలో ఎన్నికలు జరుగగా, అంగ్ సాన్ సూకీ నేతృత్వంలోనే ఎన్ఎల్డీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికలను సైన్యం మాత్రం గుర్తించలేదు. విజయం సాధించిన ఎన్ఎల్డీ, పార్లమెంట్ తొలి సమావేశం నేడు జరుగనున్న నేపథ్యంలో సైనిక తిరుగుబాటు జరగడం గమనార్హం.

దేశంలో జరుగుతున్న పరిణామాలపై సైన్యం ఇంతవరకూ స్పందించలేదు. యాంగాన్ సహా పలు నగరాలను సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. అధికార ఎమ్ఆర్టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఎమ్ఆర్టీవీ ఓ ప్రకటన చేస్తూ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏ విధమైన ప్రసారాలనూ అందించలేకపోతున్నామని వెల్లడించింది.

ఇదిలావుండగా, మయన్మార్ లో జరిగుతున్న సైనిక తిరుగుబాటుపై అమెరికా ఘాటుగా స్పందించింది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ఏ విషయాన్నైనా తాము సీరియస్ గా తీసుకుంటామని, ఎన్నికైన ప్రభుత్వం పాలన కొనసాగించేందుకు సైన్యం సహకరించాలని కోరింది. ఆలా జరగకుంటే ఆర్థిక పరమైన ఆంక్షలు తప్పబోవని ఆసియా మానవ హక్కుల డైరెక్టర్ జాన్ సిఫ్టన్ హెచ్చరించారు. అయితే, చైనా మాత్రం మయన్మార్ సైన్యానికి మద్దతుగా నిలవడం గమనార్హం.

Tags: Mayanmar, Angsan Sui ki, Arrest, Coup Army, Emergency

Leave A Reply

Your email address will not be published.