బెంబేలెత్తిస్తున్న ఎలుగుబంట్లు.. కట్టడి చేయలేరా
అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్లు చాలా గ్రామాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి ఎలుగుబంట్లు వస్తున్నాయి. పంట పొలాల్లో తిరుగుతూ నాశనం చేస్తున్నాయి. గ్రామస్థుకు కనిపించగానే దాడికి తెగబడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎలుగుబంట్ల దాడులు ఎక్కువ కావడంతో చాలా గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా గుడిబండ మండలం పలారంలో ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రఘు అనే వ్యక్తి తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా.. పొదల్లో దాగి ఉన్న ఎలుగు ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. రఘు అరుపులతో స్థానికులు రాగా.. ఎలుగుబంటి అక్కడినుంచి పారిపోయింది. గ్రామాల్లో ఎలుగులు, చిరుత దాడిలో చాలా మంది మృతిచెందినా.. పదుల సంఖ్యలో రైతులను గాయపరుస్తున్నా.. అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.